
నేను ఒక ట్రక్ డ్రైవర్‌ని. నేను చేసిన తప్పులు నేరుగా ఎవరితోను చెప్పుకోలేను. అందుకే ఇక్కడ చెప్పుకుంటున్నాను. శరీరానికి ఆకలి వేసినప్పుడల్లా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే చివరికి మన ప్రాణాల మీదకే వస్తుంది. జీవితాన్ని కాల్చేస్తుంది. మనతో పాటు మన కుటుంబ సభ్యుల భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా...శ్రీనివాస్.
నా పని చాలా దూరం ప్రాంతాలకు ట్రక్కులు లోడ్ వేసి తీసుకువెళ్లాలి. అలా నేను ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ ఇలా ఎన్నో నగరాలకు తిరుగుతూ ఉంటాను. ఒక్కసారి ట్రక్ ఎక్కానంటే వారాలపాటు నడపాల్సి వస్తుంది. తీవ్రంగా అలసిపోయినప్పుడు ఎక్కడో దగ్గర ఆగి నిద్రపోతాను. రోడ్డు పక్కనే స్టవ్ పెట్టుకొని నచ్చిన ఆహారం వండుకొని తింటాము. కొన్నిసార్లు రోడ్డు పక్కన ఉండే లాడ్జిలలో నిద్రపోతూ ఉంటాము. ఇదే నా జీవితం .. కానీ ఒక చెడు స్నేహం నా జీవితాన్ని నాశనం చేసింది. తిరిగి తప్పుని సరిదిద్దుకోలేని పరిస్థితికి వచ్చేలా చేసింది. అసలేం జరిగిందంటే...
ఓసారి ముంబైకి లోడ్ వేసుకుని బెంగళూరు నుంచి బయలుదేరాను. దారిలో నాకు రింకూ అనే వ్యక్తి కలిశాడు. అతను ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. నాతో పాటు ముంబై వచ్చాడు. ముంబై వెళ్లాక రెండు రోజులు సెలవు వచ్చింది. దాంతో రింకు నన్ను తన రూమ్ కి తీసుకెళ్లాడు. అక్కడ అతనిలాగే ఎంతోమంది అబ్బాయిలు ఉన్నారు. ఆరోజు రాత్రి రింకూ తనతో పాటు ఒక ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ ఇంటిలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. వారి వస్త్రధారణ కూడా ఏమాత్రం బాగోలేదు. అప్పుడు నాకు 30 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఎలాంటి లైంగిక అనుభవం అప్పటికి లేదు.
పెళ్లి కూడా కాకపోవడంతో అమ్మాయిలు అంటే ఆసక్తిగా ఉండేది. అప్పటికే నేను ఐదు రోజులు పాటు ట్రక్కును డ్రైవ్ చేస్తూ తీవ్రంగా అలసిపోయాను. రింకూ నాకు అక్కడ కొంతమంది అమ్మాయిలని చూపించి నచ్చిన అమ్మాయిని ఎంచుకోమని చెప్పాడు. నాకు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆమెకు డబ్బులు ఇచ్చి గదిలోకి వెళ్లాను. అదే నా తొలి అనుభవం. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా అనిపించింది. ఆ ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోలేను.
ఆరోజు జరిగిన తొలి అనుభవం.. నాకు తర్వాత అలవాటుగా మారిపోయింది. నేను ఏ నగరానికి వెళ్లినా కూడా అక్కడ ఇలాంటి ఇల్లు ఎక్కడ ఉంటాయా? అని వెతుక్కుంటూ వెళ్లేవాడిని. భోపాల్, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ ఇలా ఏ నగరంలోనికి వెళ్లినా ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో.. నేను సులువుగా చెప్పగలను. కొత్త నగరానికి వెళ్ళినప్పుడల్లా నా ఆలోచనలు కొత్త అమ్మాయిల వైపే సాగేవి. ఆ రాత్రి పని పూర్తయ్యాక ఏదో నగరాన్ని జయించిన ఆనందం వచ్చేది. దాదాపు ఇలా ఐదు సంవత్సరాల పాటు గడిపాను.
ఈ ఐదు సంవత్సరాలలో కనీసం 200 మంది మహిళలతో నేను శారీరక సంబంధం పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా కనిపించేవారు. వారు పలకరించే విధానం, నన్ను ఆహ్వానించిన విధానం, కొన్ని సార్లు తిరస్కరించిన విధానం కూడా నాకు కొత్తగా ఉండేది. ఆ కొత్త భావన ప్రతిసారీ కావాలనిపించేది. కానీ వయసు పెరుగుతున్న కొద్ది ఇంట్లో వారు పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతున్నారు.
ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. నేను ట్రక్కు డ్రైవర్ ని. నిత్యం ఏదో ఒక నగరానికి తిరుగుతూనే ఉంటాను. అలాంటప్పుడు ఇలాంటి కోరికలు కలిగినప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాను. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకుని మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అవసరమా? అనిపిస్తోంది. నేను ఆమెతో సంవత్సరంలో పది రోజులు మాత్రమే ఉండగలను. మిగతా రోజులన్నీ ఇలా వేశ్యలతోనే గడపాల్సి వస్తుంది. ఎందుకంటే అది నేను మానుకోలేని అలవాటుగా మారిపోయింది. నాకు ఎలాంటి వ్యాధులు వచ్చాయో కూడా ఇప్పుడు చెప్పలేను. ఒకవేళ ఎయిడ్స్ వంటి వ్యాధి సోకి ఉంటే అది నా భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నేను ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనిపిస్తోంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నా మనసు, మెదడు చెదిరిపోతున్నాయి. ఏమి చేయాలో తెలియడం లేదు. ఇంట్లో వారికి చెప్పుకోలేకపోతున్నాను. నా మనసులో దాచుకోలేకపోతున్నాను. నాలాగే ఎంతోమంది ట్రక్ డ్రైవర్లు ఇదే తప్పును చేస్తున్నారు. నా బాధ పదిమందికి చెబితే కాస్త మనసు తేలికగా అనిపిస్తుందని మీ దగ్గర పంచుకున్నాను.