
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం అనేది ఎంతో మంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య. ఎన్ని వ్యాయామాలు చేసిన కొందరికి పొట్ట కొవ్వు కరగదు. కానీ ప్రతిరోజూ సైక్లింగ్, రన్నింగ్ వంటివి చేయడం ద్వారా పొట్ట కొవ్వును తగ్గించుకోవచ్చు. రన్నింగ్, సైక్లింగ్ ఈ రెండూ మీకు బరువ తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ రెండూ పొట్ట తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది? దేని వల్ల త్వరగా పొట్ట కొవ్వు తగ్గుతుంది?
పొట్ట కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదకరం. పొట్టలో ఎక్కువ కొవ్వు చేరితే మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదం పెరిగిపోతుంది. దీనికోసం జీవనశైలి, ఆహారంలో మార్పులతో పాటు శారీరక శ్రమ చాలా అవసరం. ఇప్పుడు పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడానికి రన్నింగ్ లేదా సైక్లింగ్.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.
- రన్నింగ్ అనేది కార్డియో వ్యాయామాలలో ప్రధానమైనది. రోజూ ఒక గంట పాటు రన్నింగ్ చేస్తే దాదాపు 400 కేలరీలు శరీరంలో బర్న్ అవుతాయి. శరీరంలోని మొత్తం కొవ్వును తగ్గించడానికి రన్నింగ్ ప్రభావవంతమైన వ్యాయామం. దీనివల్ల మీరు బరువు కూడా త్వరగా తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఎంపిక. దీనితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
- రన్నింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. గుండె స్పందన రేటు కూడా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
- రోజూ పరుగెత్తడం వల్ల ఎముకలు, ముఖ్యంగా తుంటి, కాలి ఎముకలు బలంగా తయారవుతాయి. భవిష్యత్తులో ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- రన్నింగ్ కాళ్లు, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరాన్ని దృఢంగా మారుస్తుంది.
- సైక్లింగ్ చేసేటప్పుడు గుండె స్పందన రేటు పెరుగుతుంది, రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి రోజూ సైక్లింగ్ చేస్తే, గుండెపోటు వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
- రోజూ గంట పాటు సైక్లింగ్ చేస్తే దాదాపు 300 కేలరీలు బర్న్ అవుతాయి. దీనితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే శరీరంలోని మొత్తం కొవ్వు తగ్గుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరగడమే కాకుండా, బరువు కూడా తగ్గుతారు.
- క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల తొడ ఎముక, మోకాళ్ల కింది భాగం బలపడతాయి.
- ఊబకాయం, కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారికి సైక్లింగ్ ఒక మంచి ఎంపిక.
నిజానికి రన్నింగ్, సైక్లింగ్ రెండూ కూడా పొట్ట తగ్గించడానికి ఉత్తమ వ్యాయామాలే. ఈ రెండింటిలో ఏది చేయాలన్నదే మీ వీలును బట్టి ఎంపిక చేసుకోవాలి. అయితే క్రమం తప్పకుండా చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అప్పుడప్పుడు చేయడం, మధ్యలో ఆపేయడం వంటివి చేయకూడదు. ఆహార నియమాలు పాటించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి బరువు పెరగకుండా తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినండి. అదే సమయంలో శక్తినిచ్చే పోషకాలున్న ఆహారం తీసుకోవాలని గుర్తుంచుకోండి.