వర్షాకాలంలో జీన్స్ పై బురద మరకలు పడటం చాలా కామన్. కానీ ఈ మరకలను అంత సులువుగా పోవు. కానీ మీరు గనుక కొన్ని ప్రత్యేక చిట్కాలను ఫాలో అయ్యారంటే ఈ మరకలను చాలా ఈజీగా వదిలించుకోవచ్చు.
జీన్స్ పై ఎలాంటి మరకలు పడ్డా చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇక ఈ మరకలను సరిగ్గా క్లీన్ చేయకపోతే జీన్స్ పాత దానిలా కనిపిస్తుంటుంది. అయితే వర్షాకాలంలో జీన్స్ పై బురద మరకలు ఎక్కువగా పడుతుంటాయి. ఈ బురద మరకలు జీన్స్ ను పాత వాటిలా కనిపించేలా చేస్తాయి. అలాగే వీటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే ఇవి మొండి మరకలుగా మారిపోతాయి. మీరు కాలేజీకి లేదా ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ జీన్స్ కు కూడా బురద మరకలు పడితే టెన్షన్ పడకుండా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. చాలా ఈజీగా మరకలు తొలగిపోతాయి.
అప్పుడే పడిన బురద మరకలను ఎలా పోగొట్టాలి?
అప్పుడే జీన్స్ పై పడిన బురద మరకను వెంటనే శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ ను ఉపయోగించండి. ఒక టిష్యూ పేపర్ ను తీసుకుని జీన్స్ పై తడి బురద మరక ఉన్న చోట పెట్టండి. దీనికి దుమ్ము, ధూళి కణాలు అంటుకుంటాయి. తర్వాత మీరు ఈ మరకను నీటితో కడిగేసుకోవచ్చు. మరక ఇంకా పోకపోతే.. మీరు దానికి ఎన్నో విధాలుగా ఈజీగా పోగొట్టొచ్చు.
పొడి బురద మరకలను ఎలా తొలగించాలి?
బురద మరకలు అయ్యి 2-3 రోజుల అయితే అవి ఎండిపోతాయి. అలాగే బట్టలకు ఈ మరకలు బాగా పట్టుకుంటాయి. ఇవి ఇక పోవని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని చిట్కాలతో మీరు ఈ పొడి బురద మరకలను ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఎండిన మట్టిని మెత్తగా తుడిచి మట్టి మొత్తాన్ని తొలగించాలి. దీని కోసం మీరు బ్రష్ ఉపయోగించొచ్చు. కానీ జీన్స్ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మరకలున్న ప్రాంతాన్ని గోరువెచ్చని నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇప్పుడు ఒక బకెట్ లో కొన్ని నీళ్లు తీసుకుని అందులో డిటర్జెంట్ ను వేయండి. ఈ ద్రావణంలో మరకలు పడ్డ జీన్స్ ను కాసేపు నానబట్టి శుభ్రం చేసి శుభ్రమైన నీటితో కడిగి ఆరేయండి. అంతే మరకల అస్సలు కనిపించదు.
స్పాంజ్ తో జీన్స్ శుభ్రం
జీన్స్ పై పడిన బురద మరకలను పోగొట్టడానికి మీరు ముందుగా తేలికపాటి డిటర్జెంట్, నీటి ద్రావణాన్ని తయారు చేయండి. మరకలు మొండిగా ఉంటే దానిని పోగొట్టడానికి నీటిలో బేకింగ్ సోడా లేదా వెనిగర్ కూడా కలపొచ్చు. ఈ ద్రావణంలో స్పాంజ్ ను నానబెట్టి మరక దగ్గర రుద్దండి. ఆ తర్వాత జీన్స్ ను శుభ్రమైన నీటితో కడిగి గాలికి ఆరబెడితే సరి. ఇలా చేయడం వల్ల బురద మరకలు ఈజీగా పోతాయి.