బెడ్ పై కాకుండా.. నేలపై పడుకుంటే ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 4, 2024, 4:22 PM IST

నేలమీద కూర్చొని తినడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి నేలపై పడుకుంటే ఏమౌతుందో? అన్న సంగతి ఎంతమందికి తెలుసు? 
 


బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రవచ్చినా.. నడుం నొప్పి వస్తుందని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని చాలా మంది అంటుంటారు. అదే నేలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇలా నమ్మి నేలపై పడుకునే వారు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. నిజానికి నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి అస్సలు తగ్గదు. అంతేకాకుండా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు నేలపై పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

వెన్నెముకపై ప్రభావం:  నేలపై పడుకోవడం వల్ల వెన్నెముకపై చెడు ప్రభావం పడుతుంది. గట్టిగా ఉండే నేల ఉపరితలంపై పడుకోవడం వల్ల మీ వెన్నెముక దాని సహజ వక్రతను నిర్వహించడానికి తగినంత మద్దతు ఉండదు. దీనివల్ల కాలక్రమేణా మీ వెన్నెముక దృఢత్వం తగ్గుతుంది. అలాగే వెన్నెముక అమరిక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

కటి నొప్పి: నేలపై పడుకోవడం వల్ల వచ్చే మరొక సమస్య ఏమిటంటే.. పరుపు లేకుండా మీరు నేలపై పడుకోవడం వల్ల మీ తుంటి, భుజం వంటి కొన్ని ప్రాంతాలు మీ శరీర బరువు భారాన్ని భరించలేకపోతుంటాయి. దీనివల్ల శారీరక అసౌకర్యం, రక్తప్రసరణ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇది కటి ప్రాంతాల్లో నొప్పి,  తిమ్మిరిని కలిగిస్తుంది. ఇది మీకు రాత్రిపూట నిద్రలేకుండా చేస్తుంది. 

గాయాలు : నేలపై పడుకోవడం వల్ల శరీరానికి గాయాలయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు లేదా నిద్రమత్తులో ప్రమాదకరమైన వస్తువులను తాకడం వల్ల గాయాలు అయ్యే అవకాశం ఉంది. నేలపై నుంచి కొంతమందికి లేవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యలు లేదా వెన్నునొప్పి ఉన్నవారికి.

నిద్ర విధానాలకు భంగం: నేలపై పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కఠినమైన నేలపై పడుకోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలాగే శరీర నొప్పులు కూడా వస్తాయి. దీనివల్ల మీరు కంటినిండా నిద్రపోలేరు. దీనివల్ల పగటిపూట శారీరక అలసట, చిరాకును కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా మీ మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే నేలపై పడుకోవడం కొంతమందికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినప్పటికీ.. నేలపై నిద్రపోవడానికి ముందు దాని దుష్ప్రభావాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

click me!