
వైజాగ్ నుంచి హైదరాబాద్ కు ప్రయాణం చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. రైళ్లల్లో, బస్సుల్లో తిరిగేవారికి అవకాశం ఉండదు. కానీ సొంత వాహనంలో వెళుతున్న వారు ఆ దారి వెంట ఎన్నో అందమైన ప్రదేశాలను చూస్తూ వెళ్ళవచ్చు. మీరు సొంత కారులో ప్రయాణిస్తున్నప్పుడు వైజాగ్ నుండి హైదరాబాద్‌కి వెళ్లే దారిలో ఏ ఏ అందమైన ప్రదేశాలను చూడవచ్చో ఇక్కడ ఇచ్చాము. వీటిని కచ్చితంగా చూడండి. ఇందులో ప్రకృతి ప్రసాదించిన వరాలే కాదు దేవాలయాలు రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. మీ ప్రయాణంలో ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం నిండిపోవాలంటే వైజాగ్ నుండి హైదరాబాద్ కు రోడ్ ట్రిప్ లో వీటిని సందర్శించండి.
వైజాగ్ నుంచి చెన్నై కోల్కతా హైవే మీదుగా హైదరాబాద్ వెళ్లాలంటే NH65 ద్వారా ప్రయాణం చేయాలి. ఈ దూరం 619 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరాన్ని మీరు ఏకబిగిన వెళ్లే కన్నా పిట్ స్టాప్ లతో వెళితే ఆ ప్రయాణం హ్యాపీగా సంతోషంగా ఉంటుంది.
వైజాగ్ నుండి కారులో బయలుదేరినప్పుడు నర్సీపట్నం సమీపంలోనే ఈ అందమైన జలపాతం ఉంటుంది. ఇక్కడ ఆగి అడవుల్లో జలపాతాన్ని చూడండి. సీజన్ ను బట్టి దీని నీటి ప్రవాహం ఆధారపడి ఉంటుంది.
ఆ తర్వాత ధర్మవరం దాటుతున్నప్పుడు వరాహ నది కనిపిస్తుంది. తూర్పు కనుమలలో పుట్టిన ఈ వరాహనది బంగారమ్మ పాలెం సమీపంలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఫోటోల కోసం ఈ వరాహ నది దగ్గర ఆగవచ్చు.
ఇక ఇక్కడ నుంచి బీచులు తగులుతూనే ఉంటాయి. తిమ్మాపురం దగ్గర చిన్న మలుపు తిరగండి చాలు. అక్కడ బీచ్ కనిపిస్తుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో పిక్నిక్ చేసుకోవచ్చు. అక్కడే బంగారం పాలెం బీచ్ కూడా ఉంటుంది. ఇది చిన్న కొండ పక్కనే ఉంటుంది. అలాగే అక్కడ వల్లభ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ బీచ్ ను తనివి తీరా చూసాక మళ్ళీ మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.
అలా ముందుకు వెళితే మీరు రేవుపోలవరం బీచ్ లో చూడవచ్చు. చిన్నఉప్పలంలోని రేవుపోలవరం లో ఉన్న ఈ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ సముద్ర వంతెన కూడా ఉంటుంది. ఒక మత్స్యకార గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ బీచ్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
తునికి వెళ్లడానికి ముందే మీరు తాండవ నది వంతెనను దాటాల్సి వస్తుంది. ఈ తాండవ నది కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ మీరు బస కూడా చేయవచ్చు. అలాగే తాండవ మినీ రిజర్వాయర్ ను కూడా చూసి ఆస్వాదించవచ్చు. ఇక తాండవ రిజర్వాయర్ కంటే అందమైన పంపా రిజర్వాయర్ కూడా ఉంది. ఇది అన్నవరానికి దగ్గరలో ఉంటుంది. అలసిపోయిన వారు రీఛార్జ్ కావాలి అనుకుంటే ప్రకృతిలో కలిసిపోయిన ఈ అందమైన ప్రాంతాన్ని చూడాలి. చెన్నై కోల్కతా హైవే నుండి అన్నవరం టౌన్ రోడ్లోకి వెళితే.. మీరు అక్కడ కాసేపు సేదతీరవచ్చు. అన్నవరం దేవాలయాన్ని సందర్శించవచ్చు. శ్రీ సత్యనారాయణ స్వామికి అంకితం చేసిన ఆలయం అన్నవరం.
అన్నవరం తర్వాత మీరు రాజమండ్రి లేదా కాకినాడ వెళ్ళవచ్చు. ఈ రెండు నగరాల్లో రుచికరమైన ఆహారం లభిస్తుంది. అలాగే రాత్రిపూట అక్కడ మీరు స్టే చేయడానికి వీలుగా ఉంటుంది. రాజమండ్రి, కాకినాడ రెండిట్లో కూడా ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. మీరు రాజమండ్రి గుండా ఆపకుండా వెళ్లిపోవాలనుకుంటే గోదావరి నాలుగోవంతెన మీదుగా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. అక్కడ మాయా గోదావరిని చూడవచ్చు. ఇక కొవ్వూరు దాటుతూ ఉండగా గౌతమి ఘాటు దగ్గర కాసేపు ఆగండి. ఆ దృశ్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు.
ఇక రాజమండ్రి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏలూరు అతిపెద్ద నిమ్మకాయల మార్కెట్ కు ఏలూరు పెట్టింది. పేరు ఏలూరు నిమ్మకాయ మార్కెట్ ను ఒక్కసారైనా సందర్శించండి. ఇక ఏలూరు నుండి బయలుదేరాక భోగాపురం బైపాస్ రోడ్డుకు చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న భారీ జాతీయ జెండాను మిస్ అవ్వకుండా చూడండి.
ఇక విజయవాడ చేరుకున్నాక కృష్ణా నది ఒడ్డున ఉన్న గుహలు, దేవాలయాలు, ప్రకాశం బ్యారేజ్ అన్నీ కూడా అందంగా దర్శనమిస్తాయి. ఇక కొండపల్లి బొమ్మలకు కొలువైన కొండపల్లి అనే ఊరు కూడా అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. తెల్ల పొణికి కలపతో తయారు చేసే కొండపల్లి బొమ్మలు ఇక్కడ తక్కువ రేటుకి లభిస్తాయి. నాలుగు వందల ఏళ్లకు ముందు నుంచి ఇక్కడ ఆ బొమ్మలను తయారు చేస్తున్నారు. ఇక కొండపల్లిలో ఘాట్ రోడ్డులోకి డ్రైవ్ చేస్తే చారిత్రకమైన కొండపల్లి కోటను చూడవచ్చు. 14వ శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి ఈ కొండపల్లిని పాలించాడని చెబుతారు. ఆ తర్వాత అది గజపతులు, నిజాంలు, బ్రిటిష్ పాలనను కూడా చూసింది. ఇక కొండపల్లి జలపాతం కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే జూపూడి రిజర్వాయర్ ను కూడా మీరు దర్శించవచ్చు.
ఇక కంచెల దగ్గరలోని కీసర టోల్ ప్లాజా కు చేరుకున్నాక కీసర వంతెన ఉంటుంది. మున్నేరు నదిపై ఈ కీసర వంతెనను నియమించారు. దీన్ని ఫోటోలు తీసుకునేందుకు ఇది అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత మీరు తెలంగాణలోకి ప్రవేశిస్తారు. అక్కడ మొదట పట్టణం సూర్యాపేట. సూర్యాపేట నుంచి నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ దగ్గరలో ఉన్న పానగల్ చెరువును కచ్చితంగా చూడండి. దీని ఉదయ సముద్రం అని కూడా పిలుస్తారు. అలాగే పచ్చల సోమేశ్వర దేవాలయం కూడా విలువైన వారసత్వ ప్రదేశంగా నిలిచింది. దీన్ని కూడా మీరు కచ్చితంగా దర్శించుకోవాలి
ఇక్కడ మేము చెప్పిన విధంగా సొంత వాహనంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ కు రోడ్డు ట్రిప్పు వేసుకుంటే జలపాతాలు, బీచులు, ఆలయాలు చూసుకుంటూ సంతోషంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అర్జెంటు పనుల మీద వెళ్లిన వారికి ఇలా చూడడం కుదరదు. కానీ రెండు రోజులు ప్రయాణానికి పెట్టుకుంటూ వీటిని చూసుకుంటూ వెళ్తే ఆ ఆనందమే వేరు.