
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎన్జీవో సేవియన్ ల్యాబ్స్ నూతన అధ్యయనం ఒకటి ఆందోళనలు రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందించే తల్లిదండ్రుల్లో భయాలు రేపుతున్నది. చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లకు ఎక్స్‌పోజ్ అయితే అడల్ట్‌గా ఎదిగిన తర్వాత వారు అనేక సైకలాజికల్ సమస్యలతో బాధపడుతారని ఆ అధ్యయనం చెబుతున్నది. ఈ అధ్యయనాన్ని షావోమీ ఇండియా మాజీ సీఈవో మను కుమార్ జైన్ లింక్డ్ ఇన్‌లో షేర్ చేశారు. చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇస్తే.. వారి మానసిక ఆరోగ్యం దుర్భలంగా మారుతుందని, కాబట్టి, పిల్లలకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వడం ఆపేయండి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఓ మిత్రుడు తనకు సేవియన్ ల్యాబ్స్ అధ్యయనాన్ని పంపించాడని, ఆ అధ్యయనం చూస్తే తీవ్ర ఆందోళనకర విషయాలు తెలిశాయని మను కుమార్ జైన్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందిస్తే.. పెద్దయ్యాక దాని ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటున్నదని, అది సైకలాజికల్ డిజార్డర్‌కు దారి తీస్తుందని వివరించారు. పెద్ద్యాక మానసిక సమస్యలతో వారు బాధపడతారని శుక్రవారం తన లింక్డ్ ఇన్ పోస్టులో పేర్కొన్నారు.
పదేళ్ల వయసులో ఆడ పిల్లలు స్మార్ట్ ఫోన్‌ను స్వీకరించినవారిలో 60 శాతం నుంచి 70 శాతం వరకు మానసిక ఆరోగ్య సవాళ్లు ఎదురయ్యాయని ఆ అధ్యయనం తెలిపిందని వివరించారు. 18 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లకు ఎక్స్‌పోజ్ అయినవారిలో 46 శాతం ఈ సమస్యను ఎదుర్కొన్నారని తెలిపారు. అదే 10 ఏళ్ల లోపే స్మార్ట్ ఫోన్‌కు ఎక్స్‌పోజ్ అయిన పురుషుల్లో 45 నుంచి 50 శాతం మంది మానసిక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.
కాబట్టి, పిల్లలు ఏడుస్తున్నారని, ఆహారం తినేటప్పుడు.. లేదా తినాలని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు చిన్న పిల్లలకు ఇవ్వకుండా నియంత్రించుకోవాలని పేరెంట్స్‌కు మను కుమార్ జైన్ తెలిపారు.
Also Read: Titanic Ship: టైటానిక్ షిప్ శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇవే
స్మార్ట్ ఫోన్లు ఇవ్వడానికి బదులు వాస్తవ ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచాలని, కొన్ని ఔట్ డోర్ యాక్టివిటీలు చేయించాలని, లేదా వారి అలవాట్లను (హాబీస్) ప్రోత్సహించాలని సూచనలు చేశారు. ఇలా చేస్తే వారు ఆరోగ్యవంతంగా తయారవుతారని, సమతుల్య వాతావరణాన్ని నిర్మించడం ద్వారా ఆథెంటిక్ లర్నింగ్, సామాజిక సంబంధాలను ఏర్పరుచుకోగలుగుతారని వివరించారు.
పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని, మితిమీరిన స్క్రీన్ టైమ్‌కు అవకాశం కల్పించి తీవ్ర పరిణామాలకు వారిని లోను చేయరాదని తెలిపారు. ‘పిల్లలు అమూల్యమైనవారు. వారికి ఉజ్వలమైన, ఆరోగ్యవంతమైన భవితను అందించడానికి పునాదులు వేసే బాధ్యత మనదే అని మరిచిపోకూడదు’ అని వివరించారు.
చివరికి తాను మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లకు వ్యతిరేకిని కాదని చెబుతూ.. స్మార్ట్ ఫోన్లు, పిల్లల విషయానికి వస్తే పాటించాల్సిన జాగ్రత్తలు మాత్రమే చెబుతున్నానని పేర్కొన్నారు. కాబట్టి, పేరెంట్స్.. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.