ఆ సమయంలో ఫుడ్ తింటే.. బరువు తగ్గొచ్చు..!

First Published 18, Jul 2018, 12:07 PM IST
Highlights

ఈ సమయంలో నచ్చిన ఆహారం, కావలసినంత తీసుకోవచ్చు. అయితే ఆరు దాటిన తరువాత 16 గంటల పాటు మాత్రం కేవలం నీళ్లు, కేలరీలు లేని పానీయాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు జిమ్ లో చెమటలు చిందిస్తుంటే.. మరి కొందరు.. నోరు కట్టేసుకొని కూర్చుంటారు. అయితే.. ఈ వ్యయప్రయాసలు ఏమీ లేకుండానే బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. అది కూడా మీకు నచ్చిన ఆహారం తినొచ్చట. 

రోజులో ఒక నిర్ణీత వేళలో మాత్రమే తగినంత ఆహారం తీసుకోవడం ఊబకాయులు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని ఇల్లినాయి యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. రక్తపోటు తగ్గించుకునేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని వీరు జరిపిన ఒక పరిశోధన చెబుతోంది.

 కొంతమంది ఊబకాయులపై పన్నెండు వారాలపాటు జరిగిన ఈ పరిశోధనలో ఉదయం 10 నుంచి ఆరు గంటల మధ్యలో మాత్రమే ఆహారం తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సమయంలో నచ్చిన ఆహారం, కావలసినంత తీసుకోవచ్చు. అయితే ఆరు దాటిన తరువాత 16 గంటల పాటు మాత్రం కేవలం నీళ్లు, కేలరీలు లేని పానీయాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది.

బరువు తగ్గించుకోవడంపై జరిగిన కొన్ని ఇతర పరిశోధనల వివరాలతో పోల్చి చూసినప్పుడు పదహారు గంటలు నిరాహారంగా ఉన్నవారు బరువు వేగంగా తగ్గడంతో పాటు రక్తపోటు కూడా ఏడు మిల్లీమీటర్ల మేర తగ్గినట్లు తెలిసింది.

కొన్ని రకాల ఆహార పదార్థాలను త్యజించడం, కేలరీలు లెక్కపెట్టుకుంటూ తినడం వంటివే కాకుండా బరువు తగ్గించుకునేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయనేందుకు తమ పరిశోధన ఒక నిదర్శనమని క్రిస్టా వరాడే అనే శాస్త్రవేత్త చెప్పారు. 16:8 ఆహార పద్ధతిపై శాస్త్రీయంగా జరిగిన తొలి పరిశోధన ఇదేనని అన్నారు. అయితే ఈ అంశంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు. ఊబకాయంతో మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది తెలిసిన విషయమే. 

Last Updated 18, Jul 2018, 12:07 PM IST