వానికున్న తెలివి తేటలు నీకు లేవు అని ఇంట్లో వాళ్లు వెక్కిరించడం వినే ఉంటారు. నిజానికి కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటే.. మరికొంతమందికి తక్కువగా ఉంటాయి. ఈ తెలివితేటలు ఎక్కువగా ఉండటానికి కొన్ని అలవాట్లే కారణమని నిపుణులు అంటున్నారు. అవేంటంటే?
తెలివితేటలు ఎక్కడి నుంచో రావు.. మన రోజువారి అలవాట్లతోనే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన తెలివితేటలు శరీరం, మనస్సు రెండింటిపై ఆధారపడి ఉంటాయి. కొంతమంది పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. వారిని చూస్తే ఎంతటి పెద్దవారికైనా ఆశ్చర్యమేస్తుంది. నీకిన్ని తెలివితేటలు వచ్చాయిరా అని పొగిడేస్తుంటారు. అందుకే తెలివితేటలను పెంచే కొన్ని రోజువారి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చదివే అలవాట్లు: గొప్ప గొప్ప వాళ్లకు చదివే అటవాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీరు వినే ఉంటారు. నిజానికి చదివే అలవాటు మీ జ్ఞానాన్ని పెంచడానికి, మీ మనస్సును ఉత్తేజపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి రోజూ వార్తాపత్రిక లేదా మీకు ఇష్టమైన పుస్తకమైనా చదవండి. ఇది మీ తెలివితేటలను పెంచుతుంది.
నిద్రకు ప్రాధాన్యత : మీరు కంటినిండా నిద్రపోతేనే మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ మీకు తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు ఆలోచించడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే అభిజ్ఞా పనితీరుకు, జ్ఞాపకశక్తి సమన్వయం సరిగ్గా పనిచేయడానికి మీరు కంటినిండా నిద్రపోవాలి.
ఆసక్తి: కొంతమంది కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిజానికి కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, కుతూహలం మిమ్మల్ని ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలు నేర్చుకోవడం మీ తెలివితేటలను పెంచుతుంది.
సోషల్ ఇంటరాక్షన్: కొంతమందికి ఇతరులతో మాట్లాడటమంటే తెగ చిరాకు కలుగుతుంది. ఇంకొందరికి భయం వేస్తుంది. కానీ సమాజంలోని వివిధ వ్యక్తులతో మమేకం కావడం, వారి అభిప్రాయాలను, ఆలోచనలను. విధానాలను తెలుసుకోవడం మీ మేధో సామర్థ్యాన్ని పెంచుతుంది.
మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవడం: శరీరం బలంగా ఉండటానికి రోజూ వ్యాయామం చేసినట్టే మీ మనస్సును బలోపేతం చేయడానికి సంక్లిష్ట సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఇది చదరంగం ఆడటం కావొచ్చు, సుడోకు ఆడటం లేదా కొత్త భాషను నేర్చుకోవడం కావొచ్చు.
మెదడు సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు: ఆరోగ్యకరమైన ఆహారం కూడా మీ తెలివితేటలను పెంచడానికి సహాయపడుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలున్న ఆహారాన్ని చేర్చండి.