
నేటి తరం ఎక్కువ సమయం కూర్చునే గడుపుతుంది. ఆఫీసులో, ఇంట్లో సోఫాలో లేదా మంచం మీద కూర్చొని ఫోన్లు, టీవీలు చూస్తూ సమయం గడిపేస్తూ ఉంటారు. కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఇటీవల, కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఒక ముఖ్యమైన అధ్యయనాన్ని ప్రచురించారు. రోజుకు కేవలం 30 నిమిషాల తేలికపాటి శారీరక శ్రమ గుండె జబ్బుల ప్రమాదాన్ని 61 శాతం వరకు తగ్గిస్తుందని పేర్కొంది.
పరిశోధన ఏం చెబుతోంది?
ఈ అధ్యయనంలో 7,985 మంది పెద్దలు పాల్గొన్నారు. పరిశోధకులు వారి రోజువారీ కార్యకలాపాలు, కూర్చునే సమయం, వ్యాయామం చేసే సమయాన్ని పరిశీలించి విశ్లేషించారు. రోజుకు 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు కూర్చుని, నడవని వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. రోజుకు కనీసం 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేసేవారిలో.. ఇంటి పనులు, మెట్లు ఎక్కడం లేదా నడక వంటివి చేసే వారిలో హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం 61 శాతం తగ్గిందని గమనించారు.
ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడు కీత్ డియాజ్ మాట్లాడుతూ, “ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామం అవసరం లేదు, కొంచెం చురుగ్గా ఉంటే చాలు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడాలి లేదా నడవాలి.”
ఎందుకిలా జరుగుతుంది?
ఎక్కువ సేపు కూర్చుంటే శరీరంలో కొన్ని ప్రమాదకరమైన మార్పులు జరుగుతాయని నిపుణులు వివరిస్తున్నారు. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది, జీవక్రియ తగ్గుతుంది. శరీరంలో మంట పెరుగుతుంది. ఈ మార్పులన్నీ గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కానీ రోజుకు కొంత సమయం చురుగ్గా ఉంటే ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.
ఏం చేయాలి?
ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదు. వ్యాయామం అంటే కఠినమైన వ్యాయామం చేయాలని కాదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. ఎక్కువ సేపు వ్యాయామం చేయవలసిన అవసరం లేదని పరిశోధన చెబుతోంది. జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఉదాహరణకు-
* లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి.
* దగ్గర ప్రదేశాలకు కారుకు బదులుగా నడుచుకుంటూ వెళ్లండి.
* పని చేస్తున్నప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కూర్చోకుండా నడుస్తూ మాట్లాడండి.
* ఎక్కువ సేపు కూర్చుని స్క్రీన్‌ను చూస్తూ పనిచేస్తే ప్రతి గంటకు 5-10 నిమిషాలు లేచి నడవండి లేదా స్ట్రెచింగ్ చేయండి.