వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలతో జాగ్రత్త.. కామినేని ఆసుపత్రి వైద్యుల హెచ్చరిక

Published : Sep 10, 2026, 06:01 PM IST
Be careful with respiratory problems during the rainy season Kamineni Hospital doctors warn

సారాంశం

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఇళ్లలో బూజు చేరడం వల్ల సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు క్రమంగా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలకు దారితీయవచ్చని హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రి పల్మనాలజిస్టులు హెచ్చరించారు.

వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సీజనల్ ఇన్‌ఫెక్షన్లు ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని వైద్యులు స్పష్టం చేశారు. సాధారణంగా ఆరోగ్యవంతులలో స్వల్పంగా కనిపించే ఫ్లూ లేదా జలుబు వంటి లక్షణాలు.. శ్వాసకోశ లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని వారు తెలిపారు.

వైరల్ ఇన్‌ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా దగ్గు తగ్గకుండా కొనసాగితే దానిని సాధారణ విషయంగా కొట్టిపారేయకూడదని నిపుణులు సూచించారు. ముఖ్యంగా దగ్గుతో పాటు జ్వరం, ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా ఉండటం, శ్వాస సరిగ్గా అందకపోవడం, పిల్లికూతలు (వీజింగ్), ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం లేదా కఫంలో రక్తం పడటం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించాలి. చాలామంది స్వంతంగా యాంటీబయాటిక్స్ వాడుతుంటారని, అయితే వైద్యుల సరైన మార్గదర్శకత్వం లేకుండా మందులు వాడటం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు స్పష్టం చేశారు.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా ఆయాసం రావడం లేదా తీవ్రమైన నీరసం, గందరగోళ పరిస్థితి ఏర్పడితే వెంటనే అత్యవసర చికిత్స అవసరమని గుర్తించాలి. ఇంట్లో సరైన గాలి, వెలుతురు లేకపోవడం, గోడలకు బూజు పట్టడం కూడా శ్వాసనాళాల్లో చికాకును కలిగించి సమస్యను తీవ్రం చేస్తాయి. అలర్జీ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించకపోతే శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది.

ఈ సీజన్‌లో శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఇళ్లను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలని, ఇంట్లోకి గాలి బాగా ఆడేలా వెంటిలేషన్ చూసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆస్తమా, సీవోపీడీ బాధితులు తమ ఇన్‌హేలర్లు, సాధారణ మందులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపకూడదు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు రక్షణ చర్యలు పాటించడం, రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం వల్ల ఇన్‌ఫెక్షన్లు ఇతరులకు సోకకుండా నివారించవచ్చు. శ్వాసకోశ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే తీవ్ర పరిణామాలను నివారించవచ్చని కామినేని వైద్య బృందం స్పష్టం చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Homemaking Tips: ఇంటి పనులు చిటికెలో అయిపోవాలా? మీ టైం సేవ్ చేసే టిప్స్ ఇవిగో!
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!