మెటాపై అమెరికా ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో జుకర్‌బర్గ్ కోర్టుకు హాజరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కొనుగోలు చేయడం మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని ఆయన వాదించారు. కేసు ఓడిపోతే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను అమ్మకానికి పెట్టాల్సి రావచ్చు.
Mark Zuckerberg : సోషల్ మీడియా దిగ్గజం మెటాపై అమెరికా ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా కోర్టకు హాజరయ్యారు. తనపై, తన కంపెనీపై ఉన్న ఆరోపణలను ఆయన ఖండించే ప్రయత్నం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కొనుగోలు చేయడం మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని ఆయన వాదించారు. ఈ కొనుగోళ్లు కంపెనీ ఆవిష్కరణలు, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికేనని ఆయన తెలిపారు.
అమెరికన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దాఖలు చేసిన ఈ కేసు టెక్ కంపెనీలపై వచ్చిన అతిపెద్ద కేసుల్లో ఒకటి. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ విచారణ జరుగుతోంది. మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసి ఈ కంపెనీలను కొనుగోలు చేశారని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆరోపిస్తోంది. మెటా కొనుగోలు చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లు బాగా అభివృద్ధి చెందాయి.
వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతోంది. జడ్జి జేమ్స్ బోస్‌బర్గ్ ఈ కేసును విచారిస్తున్నారు. 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను, రెండేళ్ల తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికేనని ఆరోపణలున్నాయి. పోటీదారులను కొనుగోలు చేయడం లేదా వారిని నిర్వీర్యం చేయడం మెటా విధానమని... ఇది ఉల్లంఘన కిందకే వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఓడిపోతే జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను అమ్మకానికి పెట్టాల్సి రావచ్చు.