చైనా వాయవ్య ప్రాంతం షింజియాంగ్‌లో ఉయిగూర్ ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం, ప్రార్థనలు చేయకుండా ఉండేందుకు అక్కడి అధికారులు బలవంతంగా పని చేయిస్తున్నారు అని రేడియో ఫ్రీ ఏషియా (RFA) నివేదికలో తెలిపింది. ఇప్పుడీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ చైనాలో ఏం జరుగుతుందో తెలుసా.?
గత వారం, రంజాన్ సమయంలో ఉయిగూర్లను బలవంతంగా పనిచేయిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. RFA ప్రకారం, కొందరు వ్యవసాయ పనుల్లో ఉండగా, మరికొందరు శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమయ్యారు.
చైనాలోని షింజియాంగ్‌లో సుమారు 1.2 కోట్ల ఉయిగూర్ ముస్లింలు నివసిస్తున్నారు. చైనా ప్రభుత్వం అక్కడ మతపరమైన సంప్రదాయాలపై నిషేధం విధిస్తోంది. రంజాన్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 వరకు జరుగుతోంది. ఈ సమయంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది. చాలా దేశాల్లో ఇది స్వేచ్ఛగా జరుపుకుంటారు. కానీ చైనా మాత్రం "మత మూఢనమ్మకాలు" నివారించాలనే పేరుతో ఉపవాసాన్ని నిషేధించింది.
అక్కడి ముస్లింలు బహిరంగంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారని వీడియో తీసి రుజువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ శుక్రవారాలు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయడాన్ని కూడా నిషేధించారు. హోటాన్ ప్రాంతంలో రెండవ రోజు ఉయిగూర్లు పనిచేస్తున్న వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. అక్సు ప్రిఫెక్చర్‌లో అధికారుల ఆదేశాల మేరకు ఉయిగూర్లను రంజాన్ సమయంలో ఉపవాసం చేయకుండా ఉండేందుకు బలవంతంగా పనుల్లో పెట్టారు.
చైనా ప్రభుత్వం దీనిని తీవ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలుగా చెబుతున్నా, మానవ హక్కుల సంస్థలు ఇవి మానవతా నేరాలు, ఇలా కొనసాగితే ఇది జెనోసైడ్‌కు దారితీస్తుందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉయిగూర్లను చైనాలో బలవంతంగా పనిచేయిస్తున్నారు. వారి భాష, సంస్కృతి మీద కూడా నియంత్రణ పెడుతున్నారు. పలువురిని నిర్బంధించి వారి కుటుంబాల నుంచి వేరు చేస్తూ, ఫోర్స్‌డ్ స్టెరిలైజేషన్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
పేజివాట్‌లోని మిషా టౌన్‌షిప్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ.. ఉయిగూర్లు మధ్యాహ్నం భోజనం చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి అధికారులు సాధారణ ప్రజలకు సామూహిక విందును ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. "రహస్యంగా ఉపవాసం ఉండే వ్యక్తుల కార్యకలాపాలను భంగపరచడానికి, మేము సామూహిక భోజన కార్యకలాపాలను నిర్వహించాలని యోచిస్తున్నాము" అని తెలిపారు.
గత సంవత్సరాల్లో, అధికారులు ముస్లింలు ఉపవాసం ఉండకూడదని హెచ్చరిస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహించి, ఉయిగూర్ల పరిసరాల్లో గస్తీ తిరిగేవారు, పగటిపూట ఇళ్లను తనిఖీ చేసేవారు రాత్రిపూట నివాసితులు భోజనం చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి వారిపై నిఘా ఉంచేవారు. ఉయిగర్ ప్రభుత్వ సిబ్బందికి ఆహారం, పానీయాలను పంపిణీ చేయడం, సామూహిక విందులు నిర్వహించడం వంటి చర్యలను కూడా అమలు చేశారు.