ఇది యుద్ధ స‌మ‌యం కాదు.. ప్ర‌ధాని మోడీ మాట‌ల‌పై ఫ్రెంచ్ అధ్య‌క్షుని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Sep 21, 2022, 10:06 AM IST
Highlights

French President: ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ఇంకా యుద్ధం కాన‌సాగుతూనే ఉంది. ఈ యుద్ధం కార‌ణంగా రెండు దేశాలు మాత్ర‌మే కాకుండా యావ‌త్ ప్ర‌పంచంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. దీంతో ప్ర‌పంచ దేశాధినేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం  చేస్తున్నారు. 
 

United Nations General Assembly: ఇది యుద్ధానికి స‌రైన‌ సమయం కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట సరైనదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఎ) సెషన్‌లో మాట్లాడుతూ అన్నారు. ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం కార‌ణంగా ఆ రెండు దేశాలు మాత్ర‌మే కాదు యావ‌త్ ప్ర‌పంచం తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొన‌డానికి కార‌ణంగా మారింద‌ని అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జీఏ) 77వ సెషన్‌లో ప్రపంచ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది యుద్ధానికి సమయం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాట సరైనదని అన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 16న పుతిన్‌తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.  అక్కడ "నేటి యుగం యుద్ధానికి కాదు" అని రష్యా అధినేతకు చెప్పారు. తాను పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ప్రజాస్వామ్యం, దౌత్యం-శాంతియుత చ‌ర్చ‌లు ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసే అంశాలుగా ఉంటాయ‌ని కూడా మాక్రాన్ నొక్కి చెప్పారు. మాక్రాన్ తన ప్రసంగంలో "భారత ప్రధాని నరేంద్ర మోడీ సరైన సమయం యుద్ధానికి కాదు అని అన్నారు. ఇది పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా తూర్పుకు వ్యతిరేకంగా పశ్చిమాన్ని వ్యతిరేకించడానికి కాదు. ఇది సామూహిక సమయం. మన సార్వభౌమ సమాన రాష్ట్రాలు మనం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి..ఇది అత్యంత కీల‌క‌మైన త‌రుణం" అని అన్నారు. 

"అందుకే ఆహారం, జీవవైవిధ్యం, విద్య కోసం గౌరవప్రదమైన సమర్థవంతమైన ఒప్పందాన్ని ఉత్తర-దక్షిణాల మధ్య కొత్త ఒప్పందాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది" అని ఆయన చెప్పారు. అలాగే, ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం గురించి కూడా మాక్రాన్ మాట్లాడారు. అనేక కీల‌క విష‌యాల‌ను  ప్ర‌స్తావించారు. ప్ర‌పంచం ఎదుర్కొన‌బోయే స‌వాళ్ల‌ను గుర్తుచేశారు. "రష్యా ఈ రోజు ద్వంద్వ ప్రమాణాన్ని కొనసాగించాలని కోరుకుంటోంది, అయితే ఉక్రెయిన్‌లో యుద్ధం ఎవరినీ ఉదాసీనంగా ఉంచే వివాదం కాకూడదు" అని అన్నారు. 

New York, USA | Indian PM Modi was right when he said that time is not for war, not for revenge against the west or for opposing the west against east. It is time for our sovereign equal states to cope together with challenges we face: French President Emmanuel Macron at pic.twitter.com/HJBZJELhEF

— ANI (@ANI)

ఇదిలావుండ‌గా, ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం కార‌ణంగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభవించింది. అంత‌ర్జాతీయ వాణిజ్య స‌ర‌ఫ‌రా గొలుసుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. ఇక ఉక్రెయిన‌లోని ర‌ష్యా ఆక్ర‌మిత భూభాగాలు ర‌ష్యాలో చేర‌డానికి రిఫ‌రండం పెట్టాల‌నే వాద‌న‌ల‌కు సంబంధించిన వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, దీనిని అంత‌ర్జాతీయ స‌మాజం తీవ్రంగా ఖండిస్తోంది.  

click me!