ఇరాన్‌లో వెల్లువెత్తున్న‌ హిజాబ్‌ నిరసనలు.. పోలీసు కాల్పుల్లో ఐదుగురి మృతి.. 

By Rajesh KarampooriFirst Published Sep 21, 2022, 4:44 AM IST
Highlights

ఇరాన్ లో ఓ యువతి మ‌ర‌ణం క‌ల‌క‌లం రేగుతుంది.  హిజాబ్ ధ‌రించ‌లేద‌ని ఆ యువ‌తిని పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఆ యువ‌తి క‌స్ట‌డీలోనే ఉండగా మరణించింది. దీంతో ఆ యువతి మరణానికి పోలీసులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆందోళనలతో దేశం హోరెత్తుతోంది. ఈ క్ర‌మంలో ఐదుగురు మృతి చెందారు

ఇరాన్‌కు చెందిన యువతి పోలీసుల కస్టడీలో ఉండగా మరణించారు. ఆ యువతి మరణానికి పోలీసులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఇరాన్ తో పాటు ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఆందోళనలతో దేశం హోరెత్తుతోంది. 

అసలు ఏం జరిగిందంటే…. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సందర్శించేందుకు మహ్సా అమిని(22) అనే యువ‌తి తన కుటుంబంతో కలిసి వెళ్లింది. అయితే.. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదు. ఈ విషయాన్ని గ‌మ‌నించిన మోరల్ పోలీసులు ఆ యువ‌తిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో యువ‌తిని చిత్ర‌హింస‌లు పెట్ట‌డంతో మరుసటి రోజే మ‌ర‌ణించింది. దీంతో పెద్దఎత్తున నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త‌ మూడు రోజులుగా యువతులు, మహిళల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్ర‌మంలో కొంత‌మంది మహిళలు తమ హిజాబ్‌ను తీసివేసి, జుట్టు కత్తిరించుకుంటూ వీడియోలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రూ మ‌హిళ‌లు వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లు తీసేసి.. కాల్చివేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇరాన్‌లోని దివాండరే నగరం కుర్దిష్ ప్రాంతంలో భాగంగా ఉంది, ఇక్కడ ఎక్కువ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మంగళవారం ఇక్కడే అమీని మృతికి నిరసనగా పలు కూడళ్లలో ప్రజలు టైర్లు తగులబెట్టి నినాదాలు చేశారు. అమీని కుర్దిస్థాన్‌కు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ జరిగిన హింసాకాండలో కార్ల అద్దాలు పగులగొట్టడంతో పాటు పలుచోట్ల కాల్పులు జరిగాయి. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసు కాల్పుల్లో ఐదుగురు చనిపోయినట్లు కుర్దుల హక్కుల సంఘాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం ఇచ్చింది. 

హింసాత్మక నిరసనల్లో ఐదుగురు మృతి చెందడంతో వివాదాస్పద నైతికత పోలీసు చీఫ్ కల్నల్ అహ్మద్ మీర్జాయ్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇది కాకుండా..  చాలా మంది విశ్వవిద్యాలయ విద్యార్థులు టెహ్రాన్ మరియు మషాద్ నగరంలో కూడా వీధుల్లోకి వచ్చారు. స్థానిక చట్టాన్ని ధిక్కరిస్తూ నిరసన సందర్భంగా పలువురు బాలికలు తమ హిజాబ్‌లను విప్పారు. ఈ ఘటనను ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ఇరాన్‌లోని అమెరికా ప్రతినిధులు కూడా ఖండించారు.

డ్రెస్‌ కోడ్‌కు వ్యతిరేకంగా పోరాటం

ఇస్లామిక్ రిపబ్లిక్‌లో దుస్తుల కోడ్‌ను అమలు చేయడం ఇరాన్‌లోని మోర‌ల్ పోలీసుల విధుల్లో ఒకటి. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేయడంతో పాటు బిగుతుగా ఉండే దుస్తులు లేదా చర్మాన్ని చూపించే దుస్తులను ధరించడాన్ని నిషేధించడం కూడా ఇందులో ఉంది. 1979 ఇస్లామిక్ విప్లవం నుండి అమలులో ఉన్న ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు మహిళలు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు.

click me!