అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి తాను రెడీ అని, బైడెన్ తన టర్మ్ పూర్తి చేయలేకపోతే ఉపాధ్యక్షురాలిగా తాను ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సే ఉంటుందని కమలా హ్యారిస్ జకార్తాలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కానీ, బైడెన్ బాగానే ఉంటారని, అలాంటి అవకాశమే లేదని వివరించారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా జో బైడెన్ తన బాధ్యతలు ఈ టర్మ్ ముగిసే వరకు నిర్వర్తించలేకపోతే ఆ బాధ్యతలు తీసుకోవడానికి తాను రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం కూడా ఉపాధ్యక్షురాలిగా తన ముఖ్యమైన విధుల్లో ఒకటి అని వివరించారు. ఆమె ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. జకార్తాలో విలేకరుల సమావేశంలో ఎదురైన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు.
నిజానికి జో బైడెన్ వయసు 80 దాటుతున్నదని ప్రస్తావిస్తూ.. ఆయన బాధ్యతలు మీరు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. కమలా హ్యారిస్ ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు.
‘ప్రెసిడెంట్ వయసు, అవసరమైతే ఆ బాధ్యతలు తీసుకోవడానికి ఉపాధ్యక్షురాలి సంసిద్ధత ప్రశ్నలు సమాంతరంగా వస్తున్నాయి. ఒక వేళ ఆ అవసరం పడితే అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఉపాధ్యక్షురాలిగా చేయడం మిమ్మల్ని అధ్యక్ష పదవికి సన్నద్ధులను చేసిందా?’ అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ క్రిస్ మెగెరియన్ ప్రశ్నించారు.
యెస్ అని 58 ఏళ్ల హ్యారిస్ సమాధానం ఇచ్చారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వార్షిక సదస్సు కోసం బైడెన్ తరఫున ఆమె జకార్తాకు వెళ్లారు.
Also Read: ఉమ్మడి పౌరసత్వానికి మద్దతు తెలిపిన ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం.. ‘బహుభార్యత్వాన్ని నిషేధించాలి’
అలాగైతే.. మీరు ఆ ప్రక్రియ ఎలా ఉందని అంటారు? అని రిపోర్టర్ మరో ప్రశ్న వేశారు. ‘ముందుగా నేను ఒక ఊహాజనిత ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. కానీ, బైడెన్ బాగానే ఉంటారు. కాబట్టి, అలాంటివేమీ జరగవు’ అని హ్యారిస్ సమాధానం ఇచ్చారు. ‘అలాగే.. మరో విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఉపాధ్యక్షుడు వారు ప్రమాణం చేసేటప్పుడే ఈ బాధ్యత గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉండాలని స్పష్టంగా తెలిసి వస్తుంది. నేను అందుకు విరుద్ధమేమీ కాదు’ అని వివరించారు.
ప్రెసిడెంట్ జో బైడెన్ అమెరికాకు వృద్ధ అధ్యక్షుడు. నవంబర్ నెలలో ఆయన 81వ పడిలోకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు.