క్యాథలిక్ చర్చి అధినేత, వాటికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురయిన ఆయన సోమవారం కన్నుమూసారు. దీంతో తర్వాతి పోప్ ఎవరు? అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Pope Francis : క్యాథలిక్ చర్చి అధినేత, వాటికన్ నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. అనారోగ్య కారణంగా వాటికన్‌లోని తన నివాసంలో ఆయన మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. న్యుమోనియాతో బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్‌ను గత మార్చిలో రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రిలో చేర్చారు. 38 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన తర్వాత వాటికన్‌కు తిరిగి వచ్చారు.
న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పోప్ ప్రాన్సిస్ బాధపడుతున్నారు... ఆయన మరణానికి కూడా ఈ అనారోగ్య సమయలే కారణం. చాలాకాలం చికిత్స అనంతరం ఇటీవలే ప్రార్థనల్లో పాల్గొనడం ప్రారంభించారు. తాజాగా ఈస్టర్ సందర్భంగా వాటికన్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, ప్రజలకు ఆశీర్వచనం అందించారు.
ఎవరీ పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్ 1936లో అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013 మార్చి 13న క్యాథలిక్ చర్చి అధినేతగా ఎన్నికయ్యారు. దాదాపు 12 ఏళ్లు ఈ పదవిలో ఉన్నారు. లాటిన్ అమెరికా నుంచి ఎన్నికైన తొలి పోప్ ఆయనే.
20 ఏళ్లకే అనారోగ్యం
20 ఏళ్ల వయసులోనే పోప్ ఫ్రాన్సిస్‌కు ప్లూరిసి అనే వ్యాధి కారణంగా ఊపిరితిత్తులలోని ఒక భాగాన్ని తొలగించారు. అయినప్పటికీ ఆయన చదువుపై ఆసక్తి కనబరిచి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. క్రైస్తవ మతంపై ఆసక్తితో 1958లో జెస్యూట్ సొసైటీలో చేరారు. తర్వాత బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్‌గా పనిచేసి, చివరకు పోప్ పదవిని అధిష్టించారు.
సాధారణ జీవితం
పోప్‌కు ప్రత్యేక బంగ్లా, కారు, వంటవాళ్లు ఉండటం సాధారణం. కానీ ఆడంబరాన్ని ఇష్టపడని పోప్ ఫ్రాన్సిస్ పెద్ద భవనాన్ని వద్దనుకుని చిన్న ఇంట్లోనే నివసించారు. అలాగే కారును కూడా వాడకుండా ప్రజా రవాణా వ్యవస్థనే ఎక్కువగా ఉపయోగించారు. తనకు కావాల్సిన ఆహారాన్ని తానే వండుకుని సాదాసీదాగా జీవించారు.
యుద్ధాలను వ్యతిరేకించిన నాయకుడు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేకుండా శాంతి నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ముగియాలని ఆకాంక్షించారు. పాలస్తీనాలోని గాజాలో యుద్ధం కారణంగా పిల్లలు, మహిళలు మరణించినప్పుడు తన ఆవేదనను వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ క్రైస్తవులు దుఃఖంలో మునిగిపోయారు.
తర్వాతి పోప్ ఎవరు?
పోప్ ఫ్రాన్సిస్ మరణంతో తర్వాతి పోప్ ఎవరనే ప్రశ్న తలెత్తింది. పోప్ మరణం లేదా రాజీనామా తర్వాత కార్డినల్స్ నుంచి కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు. అంటే పోప్‌కు సన్నిహిత సలహాదారులైన కార్డినల్స్‌లో ఒకరే తర్వాతి పోప్ అవుతారు. పోప్ క్యాథలిక్ చర్చి అత్యున్నత నాయకుడిగా పరిగణించబడతారు. ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్యాథలిక్కులు పాటిస్తారు.