బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. దేశాన్ని వదిలి భారత్ లో ఆశ్రయం పొందినప్పటికీ బంగ్లా ప్రభుత్వం ఆమెపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం హసీనా, మాజీ మంత్రులు, అధికారులు కలిపి 12 మందిపై అరెస్ట్ వారెంట్‌లను జారీ చేసింది.
షేక్ హసీనాకి కష్టాలు తప్పట్లేదు. మెపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అధికారికంగా కోరారు. హసీనాతో పాటు మరో 11 మందిపై కూడా ఇదే చర్య తీసుకోనున్నారు. దేశంలో అశాంతి రెచ్చగొట్టడం, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇనాముల్ హక్ సాగర్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. పోలీసుల నేషనల్ సెంట్రల్ బ్యూరో ఇంటర్‌పోల్‌కు ఈ అభ్యర్థన పంపిందని ఆయన తెలిపారు. దర్యాప్తు, కోర్టు విచారణల్లో వెలుగు చూసిన ఆరోపణల ఆధారంగా ఈ నోటీసు కోరారు.
షేక్ హసీనాతో పాటు మరికొందరిపై బంగ్లాదేశ్ పోలీసులు ఇటీవల కొత్త కేసు నమోదు చేశారు. దేశంలో అంతర్యుద్ధం రెచ్చగొట్టడం, నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కోర్టులు, ప్రభుత్వ న్యాయవాదులు, దర్యాప్తు సంస్థల విజ్ఞప్తుల మేరకు ఇంటర్‌పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని కోరినట్లు పోలీసు అధికారి ఇనాముల్ హక్ సాగర్ తెలిపారు.
విచారణ సమయంలో నిందితుడు విదేశాల్లో దాక్కున్నట్లు తేలితే, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్‌కు సమాచారం అందిస్తామని ఆయన చెప్పారు. షేక్ హసీనాతో పాటు మిగతా వారిపై రెడ్ నోటీసు జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఇంటర్‌పోల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని ఇనాముల్ హక్ సాగర్ స్పష్టం చేశారు.