చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఉంది పాకిస్థాన్ తీరు. భారత ఆర్మీని ఎదుర్కునే సత్తా లేని పాకిస్థాన్ పిచ్చి మాటలు మాట్లాడుతోంది. అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణకు అంగీకారం తెలిపితే.. పాకిస్థాన్ ప్రధాని మాత్రం ఇది తమ విజయంగా చెప్పుకుంటున్నారు.
పహల్గామ్ దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసుకొని ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దాడులు మొదలు పెట్టింది. దీనికి ప్రతీ దాడిగా పాకిస్థాన్ భారత్‌పై దాడులకు దిగింది.
పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులకు శనివారం శనివారం సాయంత్రం నాటికి తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమ దౌత్యంతోనే ఇరు దేశాలకు కాల్పుల విమరణకు ఒప్పుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
అయితే కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచిత్ర వాదనలు చేశారు. భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని తెలిపారు. మా దేశాన్ని, మా పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకు అయినా వెనుదిరిగేది లేదంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రదాని నోటికొచ్చినట్లు వాగారు.
అక్కడితో ఆగకుండా భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, క్షిపణులతో దాడులు చేసిందని.. అనేక మంది సాధారణ పౌరుల చావుకు కారణమైందని ప్రధాని షెహబజ్ షరీఫ్ ఆరోపించారు. పాకిస్తాన్ పై నిరాధార ఆరోపణలు కూడా చేసిందని, అందుకే భారత్ కు తగిన బుద్ధి చెప్పాం.. తమ జోలికి వస్తే తాము ఏం చేయగలమో చేసి చూపించాం.. భారత్ పై యుద్ధంలో పాక్ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు.
పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అమెరికా సహాయంతో కాల్పుల విరమణకు ముందుకొచ్చిందని పాకిస్థాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.