కుక్క తోకర వంకర అన్నట్లు పాకిస్థాన్ బుద్ధి ఎప్పటికీ మారడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిన మూడు గంటల్లోనే మళ్లీ దాడులు చేసిన జిత్తుల మారి పాకిస్థాన్.. భారత్‌పై విష ప్రచారం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాక్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అబద్ధపు ప్రచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది పాకిస్థాన్. భారత్‌పై తాము దాడులు చేశామని, ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందంటూ నోటికొచ్చినట్లు వాగిన పాక్ తాజాగా మరో దుష్ప్రచరాన్ని మొదలు పెట్టింది. పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. "భారత్ నుంచి ప్రయోగించిన ఓ క్షిపణి ఆఫ్ఘనిస్థాన్‌లో పడింది" అనే అన్నారు.
అయితే దీనిపై వెంటనే ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎనాయతుల్లా ఖవారిజ్మీ ఈ ఆరోపణను “అసత్యం”గా అభివర్ణించారు.
“ఇలాంటి ఎలాంటి ఘటన జరగలేదు. ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా సురక్షితంగా ఉంది” అని ఖవారిజ్మీ స్పష్టం చేశారు. ఖామా ప్రెస్, హురియత్ రేడియోలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం కూడా పాక్ ఆరోపణలను తిరస్కరించింది. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పు అని భారత్ పేర్కొంది. దీంతో పాకిస్థాన్ బుద్ధి ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి అర్థమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.