
America: అమెరికాలో మరోసారి తుపాకుల మోతమోగింది. మిన్నియాపాలిస్‌లో గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. స్థానిక చర్చ్‌లో ప్రార్థనలకు హాజరైన పాఠశాల విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఉంది. అయితే.. ఈ దాడికి పాల్పడిన నిందితుడి ఆయుధాలపై రాసి ఉన్న వార్నింగ్ మెసేజ్ లు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ఇంతకీ ఆ మెసెజ్ ఏంటీ?
వివరాల్లోకెళ్తే.. అమెరికాలో మిన్నియాపాలిస్ నగరంలోని అన్నున్సియేషన్ కాథలిక్ చర్చ్‌లో బుధవారం కాల్పులు జరిగాయి. 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్ అనే వ్యక్తి చర్చ్ విండోస్ ద్వారా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించగా, 17 మందికి గాయపడ్డారు. పోలీసులు అందిన సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర పరిస్థితిలో ఉన్న వారిని ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాబిన్ వెస్ట్‌మన్ అనే యువకుడు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో ఆ నిందితుడు మూడు ఆయుధాలను వాడినట్టు గుర్తించారు. అందులో రైఫిల్, షాట్‌గన్, పిస్టల్ ఉన్నాయి. గమనించాల్సిన విషయమేమిటంటే.. ఆ దుండగుడి ఆయుధాలపై “Nuke India”, “Kill Donald Trump”, “ISRAEL MUST FALL”, “Mashallah”, “Suck On This!”, “Like a Phoenix we rise from the ash” వంటి హేట్ మెసేజెస్ రాసి ఉన్నాయి.
మరో విషయమేమిటంటే.. కాల్పుల అనంతరం ఆ దుండగుడు పార్కింగ్ ప్రాంతంలో రక్తపుమడుగులో కనిపించాడు. పోలీసుల అనుమానం ప్రకారం.. ఆ దుండగుడు తనని తాను గన్ తో కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడటానికి ముందు రాబిన్ డబ్ల్యూ పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలను అతను పోస్ట్ చేశాడు. దాదాపు 10 నిమిషాల నిడివి గల ఒక వీడియోను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. అందులో ఆయుధాలు, పేలుడు సామగ్రి, లోడ్ చేసిన కొన్ని గన్ మ్యాగజైన్లు కనిపించాయి.
పోలీసుల వివరాల ప్రకారం, రాబిన్ వెస్ట్‌మన్ తనను ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొన్నాడు. చట్టబద్ధంగా ఆయుధాలను కొనుగోలు చేశాడని, గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో అతను ఒంటరిగా ఈ కాల్పులకు పాల్పడినట్లు తేలింది. వీడియోల్లోని డైరీ ఎంట్రీలు చిన్నారులను హత్య చేయడం గురించి, చర్చ్ సాంక్చ్యూరీ చిత్రాలు, బుల్లెట్లు, పేలుళ్లు వంటి వివరాలను చూపించాయి. . ఈ కాల్పుల సంఘటనను డొమెస్టిక్ టెర్రరిజమ్, హేట్ క్రైమ్‌గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయంగా మారింది.