
london plane crash : భారతదేశంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి మరిచిపోకముందే బ్రిటన్ లో మరో ఘోరం జరిగింది. టేకాఫ్ అయినవెంటనే ఓ విమానం కుప్పకూలిపోయింది. అయితే ఇది చాలా చిన్న విమానం కావడంతో భారీ నష్టమేమీ జరగలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రిటన్‌లోని సౌత్ఎండ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ బి 200 అనే చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈజీజెట్ కంపెనీకి చెందిన ఈ విమానం నెదర్లాండ్స్‌లోని లెలిస్టాడ్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ చిన్న విమానం 12 మీటర్ల పొడవు ఉంటుంది.
అత్యవసర సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రజలు ఈ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని సౌత్ఎండ్ ఎంపీ డేవిడ్ బర్టన్ శాంప్సన్ కోరారు. ఈ విమాన ప్రమాదం ఎయిర్ పోర్ట్ సమీపంలోని వెస్ట్ క్లిఫ్ రగ్బీ క్లబ్ కు అత్యంత సమీపంలో జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో క్లబ్ లో 250 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విమానం ఈ క్లబ్ కు 1000 మీటర్ల దూరంలో కూలినట్లు సమాచారం. కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఇక రోచ్ ఫోర్డ్ గోల్ఫ్ క్లబ్ కూడా విమానప్రమాదం జరిగిన ప్రాంతానికి అతి దగ్గర్లో ఉంది. అయితే అక్కడివారు కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే భారీ పేలుడు దాడికి ఈ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీంతో వీటిని ఖాళీ చేయిస్తున్నట్లు ఎంపి డేవిడ్ బర్టన్ తెలిపారు.
ఈజీజెట్ వంటి విమానయాన సంస్థలు బ్రిటన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఈ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తున్నాయి. ప్రతి వారం 20 మార్గాల్లో 122 విమానాలను ఈజీజెట్ నడుపుతోంది.
ఈ ప్రమాదం తర్వాత పారిస్, అలికాంటే, ఫారో, పాల్మా, మల్లోర్కాకు వెళ్లే ఈజీజెట్ విమానాలను రద్దు చేశారు. అత్యవసర సిబ్బంది, అంబులెన్స్, వైద్య నిపుణులు, సీనియర్ పారామెడిక్ సహా నలుగురు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఈస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. ఈ ప్రమాదం చాలా తీవ్రమైనదని సౌత్ఎండ్ విమానాశ్రయ ప్రతినిధి ధృవీకరించారు.