
ఈ దాడుల్లో ప్రధానంగా నతాంజ్ అణు ఇంధన కేంద్రం పూర్తిగా దెబ్బతిన్నదని ఐఏఈఏ వెల్లడించింది. అంతేగాక, ఇస్ఫహాన్‌లో ఉన్న యురేనియం కన్వర్షన్ ప్లాంట్ కూడా తీవ్రంగా దెబ్బతిందని పేర్కొంది. ఈ కేంద్రం ద్వారా యురేనియంను శుద్ధి చేసి, సెంట్రిఫ్యూజ్‌ల ద్వారా అణ్వాయుధాలకు ఉపయోగించే ఐసోటోప్‌లుగా మార్చుతారు.
ఈ దాడుల ప్రభావంతో యురేనియం శుద్ధి కేంద్రాల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థలపై జరిగిన దాడులు సెంట్రిఫ్యూజ్‌ల కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముంది. అయితే ప్రస్తుతం రేడియేషన్ లీకేజీ లేదని ఐఏఈఏ వెల్లడించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ అణు స్థావరాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పలు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని విశ్లేషణలు చూపించాయి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా ఈ దాడులపై స్పష్టత ఇచ్చింది. టెహ్రాన్‌లోని ఇరాన్ అణు ఆయుధ ప్రాజెక్టు కార్యాలయాలపై, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన ముఖ్యమైన భవనాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ సమాచారం IDF అధికారిక 'X' ఖాతాలో వెల్లడైంది.
ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో రాకెట్లు దూసుకువచ్చినట్లు గుర్తించడంతో అలర్ట్ సైరన్లు మోగించారు. దీంతో లక్షలాది మంది ప్రజలు బంకర్ షెల్టర్లకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.