
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. శుక్రవారం రాత్రి నుండి ఈ రెండు దేశాలు పరస్పరం మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి. అయితే, ఈ పరిణామాల మధ్య ఓ సంచలన ఘటన టెహ్రాన్‌లో చోటుచేసుకుంది.
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఖమేనీ నివాసంతో పాటు అధ్యక్ష భవనం కూడా ఉంది. ఇక్కడ జరిగిన భారీ బాంబుల దాడి ఇజ్రాయెల్ "రైజింగ్ లయన్" ఆపరేషన్ లో భాగంగా భావిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి ఇరాన్‌లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. ముఖ్యంగా టెహ్రాన్‌లో ఉన్న మిలిటరీ ప్రధానులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎన్నో ప్రాణాలు పోయినట్లు అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ దాడుల్లో 78 మంది ఇరానీయులు మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.
ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ కూడా మరణించారు. ఆయన స్థానంలో ఖమేనీ కొత్త మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్లు ప్రకటించారు. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా పనిచేశారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కొన్ని స్థలాలపై కౌంటర్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.