
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహాన్‌లో ఉన్న కీలక అణు సౌకర్యాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అణు వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు.
ఈ దాడులకు తాము ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, పౌరులే తమ తదుపరి లక్ష్యాలుగా పేర్కొంది. అమెరికా గగనతల నిబంధనలను ఉల్లంఘించిందని, ఈ చర్యలతో అక్కడకు చెందిన వారికీ ఇక స్థానం లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ మొదలు పెట్టాడని, దీనిని తాము పూర్తి చేస్తామని ఇరాన్ అధికారిక మీడియా అమెరికాను హెచ్చరించింది.
నిజానికి ఇరాన్‌పై దాడి చేయడానికి ట్రంప్ వారం రోజుల సమయం ఇచ్చారు. ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతుందని, ఇందుకు వారం రోజులు గడువు ఇస్తున్నట్లు రెండు రోజుల క్రితం ట్రంప్ ప్రకటించారు.
అయితే ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే గగనతల నుంచి భారీ బాంబులను వాడి ఫోర్డో అణు కేంద్రంపై విరుచుకుపడ్డారు. దీంతో ఉద్రిక్తతలకు దారి తీసింది.
శనివారం రాత్రి ఇరాన్‌పై దాడులు చేసిన తర్వాత ఆదివారం ఉదయం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ట్రంప్.. ఈ దాడులు అమెరికా చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోతాయని అన్నారు. తమ చర్యలతో ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరాల్సిందేనని వ్యాఖ్యానించారు. అలాగే, ఇరాన్ ప్రతీకార చర్యలు చేపడితే.. గత రాత్రి దాడుల కంటే భయంకరమైన దాడులతో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
ఇరాన్‌పై దాడులకు స్పందనగా హౌతీ తిరుగుబాటుదారులు కూడా రంగంలోకి దిగారు. రెడ్ సీలో ఉన్న అమెరికా నౌకలను తమ లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రకటనలతో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా చర్యల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్ నుంచి ఎదురయ్యే దాడుల ముప్పుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించింది. అత్యవసరమైతే కానీ ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. అటు సైనిక రంగంలో రహస్య చర్యలు మొదలైనట్లు సమాచారం.