
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా తమ ఫైటర్ జెట్లు పంపించి ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. “అన్ని విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. ఇప్పుడు శాంతికి సమయం,” అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అమెరికా అధికారికంగా ఈ యుద్ధంలోకి అడుగుపెట్టినట్లు ఇదే మొదటి స్పష్టమైన సంకేతం.
శక్తిమంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా బలగాలు ఇరాన్‌లోని అత్యంత రహస్యమైన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాయి. ఫోర్డోపై భారీ బాంబులు వదిలారు. నటాంజ్, ఇస్ఫహాన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయని సమాచారం. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా భాగస్వామ్యమైంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో కేంద్రం ధ్వంసమైనట్లు అంచనా. అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది. “ప్రపంచంలో మరే దేశం ఇలాంటి సాహసం చేయలేదు,” అంటూ ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ ఇటీవలే ఇరాన్‌కు రెండు వారాల గడువు ఇచ్చారు. అణు చర్చలు జరపాలని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. కానీ 48 గంటల వ్యవధిలోనే ఈ ప్రకటనలను విస్మరించి బలవంతపు చర్యలకు దిగారు. గురువారం చేసిన ప్రకటనలో “ఇరాన్‌తో చర్చలకు అవకాశముంటే దానిపై నిర్ణయం తీసుకుంటాం” అని అన్నారు. కానీ శనివారం రాత్రి భీకర దాడి చేసి, ఆ దృక్పథం మారినట్లు స్పష్టం చేశారు.
ఫోర్డో అణు కేంద్రం, ఇరాన్‌లోని ఖామ్ నగరానికి సమీపంలో ఉంది. దీనిని పర్వతాల మధ్యలో భూగర్భంలో నిర్మించారు. 2023లో ఐఏఈఏ అధికారులు ఇక్కడ 83.7 శాతం శుద్ధిచేసిన యురేనియం ఉన్నట్లు గుర్తించారు. ఇది అణుబాంబు తయారీకి అత్యంత కీలకమైన స్థానం. ఈ స్థావరం ధ్వంసమవడం వల్ల ఇరాన్ అణు ప్రణాళికలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేంద్రంపై ఇజ్రాయెల్, అమెరికా శాటిలైట్ డేటా ఆధారంగా గత కొంతకాలంగా ట్రాకింగ్ చేస్తున్నాయి.
అమెరికా దాడితో ఈ యుద్ధం ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్న రష్యా, చైనా వంటి దేశాలు ఇలాంటి పరిణామాలపై ఎలా స్పందిస్తాయనే అంశంపై ప్రపంచం దృష్టి సారించింది. ఒకవేళ ఈ రెండు దేశాలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రంగంలోకి దిగితే, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీసినట్లే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ గతంలో “అమెరికా దాడి చేస్తే ఊహించలేని నష్టం చూపిస్తాం” అని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా దాడి తర్వాత ఇరాన్ నుంచి బలమైన ప్రతిస్పందన రావొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇస్ఫహాన్ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి ప్రకారం కొన్ని పేలుళ్లు జరిగాయని ధృవీకరించారు. ప్రజలు కూడా పేలుళ్ల శబ్దాలు వినారని స్థానిక మీడియా పేర్కొంది. దీంతో ఇరాన్ తిరుగుబాటు చర్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.