
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఓవైపు అమెరికా యుద్ధంలోకి దిగడం మరోవైపు ఇరాన్ రష్యా సహాయాన్ని కోరుతుండడంతో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి.
సోమవారం (జూన్ 23, 2025) నాటికి బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 79.12 డాలర్లకు చేరింది. అదే సమయంలో యూఎస్ క్రూడ్ ధర 2.8 శాతం పెరిగి 75.98 డాలర్లకు చేరుకుంది. ఈ ధరలు గత ఐదు నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
ఇరాన్ పార్లమెంట్ ఆమోదించిన విధంగా హర్మూజ్ జలసంధిని మూసివేసే ప్రతిపాదన అమలవుతుందని తెలుస్తోంది. హర్మూజ్ ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో సుమారు 20 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది.
హర్మూజ్ మూసివేస్తే రోజుకు 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచే ప్రమాదం ఉంది. ఇదే కనక జరిగితే చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 130 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్ ధరలు జూన్ 13 నుంచి ఇప్పటివరకు 13 శాతం పెరిగాయి.
భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో 67 శాతం, ఎల్‌ఎన్‌జీ అవసరాల్లో 50 శాతం వరకు హర్మూజ్ జలసంధిపై ఆధారపడుతుంది. హర్మూజ్ మూసివేత జరిగితే రోజుకు కనీసం 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం కచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది పరోక్షంగా రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107గా ఉంది. అయితే ఉద్రిక్తతలు తగ్గకపోతే కచ్చితంగా రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్‌పై కనీసం రూ. 5 పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం, ఆస్ట్రేలియా ASX 0.7 శాతం తగ్గాయి. ఐరోపా , అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి. అమెరికా S&P 500 ఫ్యూచర్స్ 0.5 శాతం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.6 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇదే సమయంలో బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. ఔన్సు బంగారం ధర 0.1 శాతం తగ్గి 3,363 డాలర్లకు చేరింది. మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి అమెరికా నేరుగా మద్దతివ్వడం వల్ల పశ్చిమాసియా పూర్తిగా యుద్ధంలోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాలు భారత్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ వంటి దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యం ప్రభావితమవుతుంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌తో వాణిజ్య బంధాలు తగ్గుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే మన దిగుమతులు, ఎగుమతుల వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అధికంగా ఇంధన దిగుమతులపై ఆధారపడటంతో ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుంది. పెరిగిన ఇంధన ధరలు, వాణిజ్య వ్యవస్థపై ఒత్తిడితో పాటు ఆర్థిక వృద్ధిని మందగించించే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్రంగా ఉధృతమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" చివరి దశలోకి చేరిందని, తాము కోరుకున్న ముఖ్యమైన లక్ష్యాలు సాధించడానికి దాదాపు చేరువైనట్లు తెలిపారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా చేసిన బాంబు దాడుల అనంతరం, ఈ విషయాలపై నెతన్యాహు స్పందించారు. ‘‘ఇరాన్ అణ్వాయుధ అభివృద్ధిని వెనక్కు నెట్టేందుకు ఈ చర్యలు చేపట్టాం. ఫోర్డో వంటి కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించడం ద్వారా ముప్పును తిప్పికొట్టాం. ఇక మేము మా లక్ష్యానికి చేరుకుంటే, ఆపరేషన్‌ను ముగించగలుగుతాం’’ అని చెప్పారు.
ప్రస్తుత యుద్ధం దీర్ఘకాలం కొనసాగదని స్పష్టం చేశారు నెతన్యాహు. ‘‘ఇరాన్ పాలకులు మమ్మల్ని పూర్తిగా చెరిపేయాలని చూస్తున్నారు. ఈ కారణంగానే తాము ముందస్తు చర్యలు తీసుకున్నాం. అయితే ఇది అనవసరమైన యుద్ధం కాదు. స్పష్టమైన రెండు ముప్పులను తొలగించడమే మా లక్ష్యం. అవే అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి. ఈ రెండింటినీ అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి అడుగు ముందుకేస్తున్నాం’’ అన్నారు.