
ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన అణు దాడుల కారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత రూపాయి విలువ తీవ్రంగా పడిపోయింది. దుబాయ్‌లో రూపాయి విలువ 8 వారాల కనిష్టానికి చేరింది. ఒక్క దిర్హాం విలువ 23.46 రూపాయలు (డాలర్‌తో పోల్చితే ₹86.17)కి చేరింది.
కొద్ది రోజులుగా ఒక్క దిర్హాం 23.30 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అయితే ఇప్పుడు దాదాపు 0.7% పడిపోవడంతో, యూఏఈలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ఇది సానుకూలంగా మారింది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇండియాకి డబ్బు పంపితే మంచి ఎక్స్‌చేంజ్ రేట్లు దక్కుతాయి.
అయితే రూపాయి విలువ పడిపోవడం కొంత మందికి మేలు జరుగుతుందని అనడంలో నిజం ఉన్నా ఎక్కువ మందికి మాత్రం నష్టం చేకూర్చనుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన కొన్ని గంటలలోనే చమురు ధరలు 10% పెరిగాయి. భారత్ తన అవసరాలకు పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటోంది. రూపాయి పతనం కారణంగా ఇప్పుడు చమురు కొనుగోలుకు మరింత ఖర్చవుతుంది. ఇది దేశ ఆర్థిక స్థిరతపై ప్రభావం చూపుతుంది.
దుబాయ్‌లో ఉన్న రిమిటెన్స్ కంపెనీ ట్రెజరీ మేనేజర్ నీలేశ్ గోపాలన్ మాట్లాడుతూ.. "మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలే రూపాయి పతనానికి ప్రధాన కారణం. కానీ, అమెరికాతో టారిఫ్ ఒప్పందం లేకపోవడమూ మరో ప్రమాదం." ట్రంప్ మరోసారి జూలై నెలలో డెడ్‌లైన్‌ను గుర్తు చేశారు. ఈ పరిస్థితి రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచవచ్చు. అని చెప్పుకొచ్చారు.
బార్జీల్ జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ కృష్ణన్ రామచంద్రన్ మాట్లాడుతూ.. రూపాయి ఇప్పటికే డాలర్‌తో పోల్చితే రూ. 86 వద్ద ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు $80–$85కి పెరిగితే, ఇండియాకు భారీ వాణిజ్య లోటు ఏర్పడుతుంది. దాంతో రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగి అది రూ. 87కి కూడా చేరే అవకాశం ఉంది. ఆర్బీఐ సకాలంలో దౌత్యపూర్వకంగా జోక్యం చేసుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతే దేశ ఆర్థిక స్థితి గందరగోళంగా మారుతుంది.
ఇండియా వద్ద మించిన విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితి ఎక్కువ కాలం కొనసాగితే మానిటరీ పాలసీని సరిగా అమలు చేయడం కష్టం అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.