
21వ శతాబ్దపు సమస్యల పరిష్కారానికి అమెరికా, భారత్‌ల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమైనదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం అన్నారు. భారత విదేశాంగ మంత్రితో ఆయన సమావేశం అయిన ఒక రోజు తరువాత ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఇరు పక్షాలు ఉన్నత విద్యా సంస్థల మధ్య బంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు
ఈ సందర్భంగా హోవార్డ్ యూనివర్శిటీ ఫర్ ఇండియా-యుఎస్ ఎడ్యుకేషన్ కోలాబరేషన్ విద్యార్థులు, అధ్యాపకులతో బ్లింకెన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఎస్ యూనివర్సిటీలలో దాదాపు 200,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు.
ఈ సమ్మేళనం సందర్భంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. ‘‘ 21వ శతాబ్దపు సమస్యలను పరిష్కరించడానికి యూఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఖచ్చితంగా కీలకమని నేను విశ్వసిస్తున్నాను. మీ కృషి ఆ బంధానికి మూలాధారం ’’ అని పేర్కొన్నారు.
‘‘ యూఎస్‌లో 200,000 మంది భారతీయ విద్యార్థులు మా క్యాంపస్‌లల్లో చదువుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. దీంతో పాటు ఫుల్‌బ్రైట్ లేదా గిల్‌మాన్ ఫెలోషిప్‌ల వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా చాలా మంది అమెరికన్ విద్యార్థులు భారతదేశంలో కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. ’’ అని బ్లింకెన్ అన్నారు. ఇరు దేశాల ప్రజల కోసం వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసి నేర్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ‘‘ ప్రజలకు సేవలు సులభతరం చేయడానికి యూఎస్, భారతదేశంలోని విద్యా సంస్థలో విద్య, నైపుణ్య శిక్షణపై వర్కింగ్ గ్రూప్ కలిసి కొత్త ఉమ్మడి పరిశోధన కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.
‘‘ విశ్వవిద్యాలయాలు, భాగస్వాముల కోసం మరిన్ని అవకాశాలను సృష్టించడంపై ఈ గ్రూప్ దృష్టి చాలా ఎక్కువగా ఉంది. తద్వారా మనలో ఎక్కువ మంది ప్రజలు ఒకరితో ఒకరు కలిసి నేర్చుకోగలుగుతారు ’’ అని అన్నారు. ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.