
ఈక్వెడార్, ఉత్తర పెరూ తీర ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనల వల్ల దాదాపు 14 మంది మరణించారు. అనేక ఇళ్లు, పాఠశాలలు, వైద్య భవనాలకు నష్టం వాటిల్లిందని రాయిటర్స్ తెలిపింది. భూకంప నష్టాన్ని తక్షణమే సరిచేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలను అలెర్ట్ చేశామని, తగినంత ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచామని ఈక్వెడార్ అధ్యక్షుడు గుల్లెర్మో లాస్సో ఒక ప్రకటనలో తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5గా నమోదైందని చెప్పారు.
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి..
గ్వాయాస్ ప్రావిన్స్ లోని బలావో నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో 66.4 కిలోమీటర్ల (41.3 మైళ్లు) లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్ ) తెలిపింది. ఈ భూకంపంలో ఎల్ ఓరో ప్రావిన్స్ లో 12 మంది, అజుయ్ ప్రావిన్స్ లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్ సర్వీస్ పేర్కొంది. దాదాపు 120 మంది గాయపడ్డారు.
భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఏడు ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా తెలిపింది. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 20 విద్యా కేంద్రాలు, 30కి పైగా ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. శాంటా రోసా విమానాశ్రయానికి స్వల్ప నష్టం జరిగినప్పటికీ కార్యకలాపాలు కొనసాగాయి.
ఈక్వెడార్ డైరెక్టరేట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రకటన ప్రకారం.. అజువై ప్రావిన్స్ లో గోడ కూలి వాహనంపై పడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ పెట్రోక్యుడార్ ముందు జాగ్రత్త చర్యగా అక్కడున్న సిబ్బందిని ఖాళీ చేయించింది. కార్యకలాపాలను నిలిపివేసింది. ఈక్వెడార్ జియోఫిజిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రకారం.. అసలు భూకంపం తరువాత గంట వ్యవధిలో రెండు తక్కువ ప్రభావం ఉన్న ప్రకంపనలు సంభవించాయి. పెరువియన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరిగినట్టు నివేదికలు లేవు.