
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు తాజా దాడులతో వందలాది మంది ప్రజలు మరణించారు. ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. అయితే ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలపైనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా భారత్‌పై 5 ప్రభావాల ఏంటో చూద్దాం.
భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం ముట్టడి దిగుమతుల మీద ఆధారపడుతుంది. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశముంది. దీంతో భారత ప్రభుత్వ ఖర్చులను పెంచాల్సి వస్తుంది. ఇది రూపాయి విలువ తగ్గడానికి కారణమవుతుండొచ్చు. ఉదాహరణకు చమురు ధర 10 డాలర్లు పెరిగే భారత GDP 0.3 శాతం తగ్గొచ్చు, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరిగే ప్రమాదముంది. ఫలితంగా సామాన్యుడిపై ఇంధన ధరల భారం పెరగొచ్చు.
చమురు ఆధారిత వస్తువులపై ఆధారపడే కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. ఇంధన కంపెనీలు (IOCL, BPCL, HPCL) లాభాలు తగ్గుతాయి. విమానయాన సంస్థలు ఫ్యూయెల్ ఖర్చులు పెరిగి, టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంది.
పెయింట్, కెమికల్, ఫార్టిలైజర్ కంపెనీలు కూడా ముడి వస్తువుల ధరలు పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తుంది. లేదా లాభాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లాస్టిక్, రబ్బరు ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుంది.
ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారత వాణిజ్యం ఇప్పటికే ఉంది. కానీ యుద్ధం తీవ్రత పెరిగితే, షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగి ఎగుమతులు, దిగుమతుల ఖర్చులు 15-20 శాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెడ్ సీ, హార్ముజ్ జలసంధుల్లో షిప్పింగ్ ఆగిపోతే యూరప్, అమెరికాతో వాణిజ్యం దెబ్బతింటుంది. ఫార్మా, డైమండ్, హోం టెక్స్‌టైల్ ఎగుమతులు తగ్గిపోతాయి. ఇది దేశీయ ఎకానమీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలైన UAE, ఖతార్, సౌదీ, బహ్రేన్ లాంటి దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు తీవ్రంగా తగ్గొచ్చు. ముఖ్యంగా ఔషధాలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తుల రవాణా నెమ్మదించవచ్చు. ఇవన్నీ భారత పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సన్‌ఫార్మా, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిన్, ఆదానీ, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ కంపెనీలు ఇజ్రాయెల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. యుద్ధం కొనసాగితే వీటి కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు రక్షణ ఇవ్వడం, కార్యాలయాలను మళ్లించడం వంటి చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు.