ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం: 2025 వరకు కొంచెం కొంచెం తినండి.. ప్రజలకు కిమ్ ఆదేశాలు

By telugu teamFirst Published Oct 28, 2021, 4:18 PM IST
Highlights

ఉత్తర కొరియా ఆహార సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. అంతర్జాతీయ ఆంక్షలు, కరోనా మహమ్మారి, తుఫాన్‌లతో పంట నష్టపోవడం, చైనా నుంచీ దిగుమతులు నిలిచిపోవడంతో ఉత్తర కొరియాలో పౌరులకు సరిపడా ఆహార నిల్వలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ 2025 వరకు ప్రజలు ఆహారాన్ని కొంచెం కొంచెం తినాలని, తక్కువగా తింటూ ఆహార నిల్వలను కాపాడుకోవాలని సూచనలు చేశారు.
 

న్యూఢిల్లీ: ఒంటరి ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న North Korea వరుస సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. నేటి ప్రపంచంలో విదేశాలతో సంబంధాలు లేని దేశాలు మనుగడ సాధించడం కష్టసాధ్యం. కానీ, ఉత్తర కొరియా అదే దారిలో వెళ్తున్నది. China, Russia వంటి కొన్ని దేశాలతో మినహా ఇతర దేశాలతో కొరియా సత్సంబంధాలను కొనసాగించడం లేదు. Americaతో కయ్యం పెట్టుకున్న ఈ దేశం న్యూక్లియర్ ఆయుధాలు, ఇతర ఆయుధ ప్రాజెక్టుల కోసం భారీగా వెచ్చిస్తున్నది. దీనిపై పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నాయి. అందుకే ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా మహమ్మారికి తోడు ఇప్పుడు చైనా నుంచి దిగుమతులూ నిలిచిపోయాయి. ఈ బాధలే సరిపోవన్నట్టు గతేడాది తుఫానులు సంభవించాయి. ఫలితంగా ఆ దేశంలో వ్యవసాయం తీవ్రంగా నష్టపోయింది.

ఈ ప్రతికూల పరిస్థితులన్నీ వెరసి ఉత్తర కొరియాలో Food Crisisకు దారితీశాయి. ఇప్పుడు ఆ దేశంలో పౌరులు తినేంత పంట పండలేదు. ఇతర దేశాల నుంచి దిగుమతులూ నిలిచిపోయాయి. అంతర్జాతీయ సహకారం ముందు నుంచే లేదు. దీంతో పౌరులకు తిండిగింజలకూ కష్టమొచ్చింది. 

Also Read: అమెరికా వల్లనే యుద్ధ వాతావరణం.. ఆయుధ సంపత్తి పెంచుకుంటాం: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

ఈ తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు Kim Jong Un ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధమవ్వాలని అన్నారు. 2025వ సంవత్సరం దాకా ప్రజలు మితంగా భుజించాలని సూచించారు. దేశంలో ప్రజల ఆహార పరిస్థితులు కఠినంగా మారుతున్నాయన్నారు. వ్యవసాయరంగం దేశ ప్రజలకు సరిపడా పంటను పండించలేకపోయిందని వివరించారు.

ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం 2025 వరకు కొనసాగే అవకాశముందని, పొరుగు దేశంతో అప్పటి వరకు చర్చలు జరిగే అవకాశం లేదని కొన్నివర్గాలు వివరించాయి. చైనాకు ఉత్తర కొరియాకు మధ్య వాణిజ్యం 2025కు ముందు మళ్లీ మొదలయ్యే అవకాశాల్లేవని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ దక్షిణ హాంగ్యోంగ్ తూర్పు ప్రావిన్స్‌లో సమావేశమైంది. దేశంలోని కఠోర పరిస్థితులపై చర్చించింది. 

దేశ ప్రజలు మరో కఠిన మార్చ్‌కు సిద్ధమవ్వాలని, శ్రమదానానికి, త్యాగాలకు సిద్ధం కావాలని కిమ్ జోంగ్ ఉన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో వర్కింగ్ పార్టీ అధికారులకు సూచనలు చేశారు. 1990లో దేశంలో ఏర్పడ్డ ఘోర కలిని ప్రస్తావించినట్టు తెలిసింది. అదే తరహా పరిస్థితులు మళ్లీ దేశంలో ఏర్పడనున్నట్టు ఆయన పేర్కొన్నారని కొన్నివర్గాలు తెలిపాయి.  

Also Read: ఐక్యరాజ్య సమితికి ఉత్తర కొరియా వార్నింగ్.. ‘బాలిస్టిక్ క్షిపణి’ చర్చపై ఫైర్

సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య వైరం పరోక్ష కారణంగా కొరియా నిలువునా చీలిపోయింది. దక్షిణ, ఉత్తర కొరియాలుగా విడిపోయాయి. దక్షిణ కొరియాకు అమెరికా మద్దతు ఉంటే, ఉత్తర కొరియాకు సోవియెట్ యూనియన్ సహకారం ఉండేది. కానీ, 1990లలో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దీంతో ఉత్తర కొరియా ఒక్కసారిగా విపత్తులోకి జారిపోయింది. అప్పుడు దేశంలో ఘోర కలి నెలకొంది. ఆ ఆహార సంక్షోభం ఉత్తర కొరియాలో కనీసం 30 లక్షల మంది పౌరులు మరణించారు. అప్పుడే అధికారంలోని కమ్యూనిస్టు పార్టీ అధికారులు మార్చ్‌కు పిలుపునిచ్చారు. ప్రాణాలు పోతున్నా.. శ్రమదానం చేయడానికి సిద్ధమవ్వాలని సమాయత్తం చేశారు. అప్పటి సంక్షోభాన్ని తాజాగా కిమ్ జోంగ్ ఉన్ గుర్తుకు తేవడం ప్రస్తుతం ఉత్తర కొరియాలోని దుస్థితిని తెలియజేస్తున్నాయి.

click me!