Delta Variant: చైనాలో రికార్డు బ్రేక్ చేసిన డెల్టా వేరియంట్ కేసులు.. ఆందోళనలో అధికారులు

By telugu teamFirst Published Nov 15, 2021, 2:29 PM IST
Highlights

చైనాలో మరోసారి కరోనా భయాందోళనలు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కేసులు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. దీంతో చైనా సహా ఇతర దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చైనాలోని దాలియన్ నగరంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నగరం నుంచి బయటకు వెళ్తున్నవారిపైనా కచ్చితంగా 14 రోజుల క్వారంటైన్ నిబంధన అమలు చేస్తున్నాయి.

న్యూఢిల్లీ: Coronavirus డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తున్నది. ఎప్పుడు ఎక్కడ Delta Variant కేసులు విజృంభిస్తాయోననే భయం అన్ని దేశాల్లోనూ ఉన్నది. ఎందుకంటే ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉన్నది. దీంతో కొన్ని Caseలు రిపోర్ట్ అయినా.. దావానలంలా వ్యాప్తి చెందడానికి దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఈ భయంతోనే డెల్టా కేసులు రిపోర్ట్ కాగానే అధికారులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు. తొలిసారిగా కరోనా కేసు అధికారికంగా నమోదైన Chinaలో ఈ సారి డెల్టా వేరియంట్ పంజా విసురుతున్నది. తొలిసారిగా ఈ దేశంలో డెల్టా వేరియంట్లు రికార్డు బ్రేక్ చేశాయి. గత వారం ఈశాన్య చైనాలోని ఓ నగరంలో ఒక్క ఉదుటున డెల్టా కేసులు పెరిగాయి. దీంతో చుట్టు పక్కల నగరాలు అప్రమత్తమయ్యాయి. ఆ నగరం నుంచి వచ్చే ప్రయాణికులందరికీ 14 రోజుల క్వారంటైన్ విధిస్తున్నాయి.

చైనాలో గత వేసవిలో డెల్టా వేరియంట్ భయాందోళనలు సృష్టించింది. అప్పుడు గరిష్టంగా 1,280 డెల్టా కేసులు నమోదయ్యాయి. తాజాగా, డెల్టా కేసులు మరోసారి విజృంభించి ఆ రికార్డును బ్రేక్ చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు చైనాలో స్థానికంగా నమోదైన డెల్టా వేరియంట్ కేసులు 1,308కి చేరాయి. ఇది గత రికార్డును బ్రేక్ చేసింది. ఈ సంఖ్యలపైనే అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: కశ్మీర్‌లో థర్డ్ వేవ్? హాట్‌స్పాట్‌గా శ్రీనగర్.. పెరుగుతున్న కరోనా కేసులు

చైనాలో అత్యధికంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 21 ప్రావిన్స్‌లు, రీజియన్లు, మున్సిపాలిటీల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. సంఖ్యా పరంగా చూస్తే ఇది తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఒక్క సారిగా కేసులు పెరగడానికి ఎంతో కాలం పట్టదని స్థానిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక, చైనా జీరో టాలరెన్స్ పద్ధతి అవలంభిస్తున్నది. అంటే ఒక్క కేసూ లేకుండా చూడటమే దాని విధానం. ఈ తరుణంలో వేయికి పైగా డెల్టా కేసులు నమోదు కావడం దేశంలో కలవరాన్ని కలిగిస్తున్నది.

Also Read: Norovirus : కేరళలో కలవరం సృష్టిస్తున్న మరో కొత్త వైరస్.. 13 మందికి ‘నోరో’ !

ఇప్పుడు ఈశాన్య నగరం దాలియన్‌లో డెల్టా వేరియంట్ విజృంభణపైనే దేశం ఫోకస్ పెట్టింది. కఠిన ఆంక్షలు, కాంటాక్టు సేకరణ, తరుచూ టెస్టుల చేయడం వంటి పద్ధతులత ఇతర ప్రావిన్స్‌లు అప్రమత్తమయ్యాయి. దేశంలో అత్యధిక డెల్టా కేసులు దాలియన్‌ నగరంలోనే రిపోర్ట్ అయ్యాయి. నవంబర్ 4 నుంచి ఇక్కడ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు సగటున 24 కేసుల చొప్పున ఈ నగరంలో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో దాలియన్‌ నుంచి బయటకు వెళ్లే వారిపైనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఉదాహరణకు అన్షాన్, షేన్యాంగ్ నగరాలు.. దాలియన్ నుంచి వచ్చే ప్రతివారికి 14 రోజుల పాటు క్వారంటైన్ విధిస్తున్నాయి. నవంబర్ 14 నాటికి చైనాలో 98,315 కేసులు నమోదయ్యాయి. సుమారు 4,536 మరణాలు చోటుచేసుకున్నట్టు రాయిటర్స్ వెల్లడించింది.

click me!