హాంకాంగ్‌పై చైనా పూర్తి నియంత్రణ సాధించిందన్న జీ జిన్‌పింగ్.. తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Oct 16, 2022, 10:36 AM IST
Highlights

హాంకాంగ్‌పై చైనా సమగ్ర నియంత్రణను సాధించిందని ఆ దేశ  అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వెల్లడించారు. హాంకాంగ్‌లో పరిస్థితి గందరగోళం నుంచి  సుపరిపాలనకు పెద్ద పరివర్తనను సాధించిందని పేర్కొన్నారు.

హాంకాంగ్‌పై చైనా సమగ్ర నియంత్రణను సాధించిందని ఆ దేశ  అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వెల్లడించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ  20వ జాతీయ మహాసభలను జీ జిన్‌పింగ్ ఆదివారం ప్రారంభించారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌‌లో వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 2,300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. చైనాలో తన పార్టీ పాలనను ప్రశంసించారు. కోవిడ్-19 వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న విధానాలను సమర్థించారు. అదే సమయంలో ప్రైవేట్ రంగానికి మద్దతుని పునరుద్ఘాటించారు. 

హాంకాంగ్‌పై చైనా సమగ్ర నియంత్రణను సాధించిందని జిన్‌పింగ్ తెలిపారు. హాంకాంగ్‌లో పరిస్థితి గందరగోళం నుంచి  సుపరిపాలనకు పెద్ద పరివర్తనను సాధించిందని పేర్కొన్నారు. చైనా-తైవాన్ వైరంలో ‘‘బాహ్య శక్తుల’’ జోక్యాన్ని ఆయన ఖండించారు. తైవాన్ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా చైనా పెద్ద పోరాటం చేసిందని, కృతనిశ్చయంతో ఉందన్నారు.

తైవాన్ సమస్యను పరిష్కరించే బాధ్యత చైనా ప్రజలపై ఉందని అన్నారు. బలాన్ని ఉపయోగించుకునే హక్కును చైనా ఎప్పటికీ వదులుకోదని స్పష్టం చేశారు. ‘‘మేము గొప్ప చిత్తశుద్ధి, గొప్ప ప్రయత్నాలతో శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం. కానీ బలప్రయోగాన్ని విడిచిపెట్టడానికి ఎప్పటికీ కట్టుబడి ఉండము’’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. 

చైనా వాతావరణ మార్పుపై ప్రపంచ పాలనలో చురుకుగా పాల్గొంటుందని జిన్‌పింగ్ తెలిపారు. ‘‘బొగ్గు స్వచ్ఛమైన, సమర్థవంతమైన వినియోగాన్ని బలోపేతం చేస్తామని’’ అని ఆయన హామీ  ఇచ్చారు. 

ఇదిలా ఉంటే.. ఐదేళ్లకోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు నిర్వహిస్తారు. నేడు ప్రారంభమైన చైనా కమ్యూనిస్ట్ పార్టీ  20వ జాతీయ మహాసభలు.. అక్టోబర్ 22 వరకు సాగనున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున బీజింగ్ చుట్టూ భద్రతను పెంచారు. ఈ సమావేశాల్లో చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితుడయ్యే అవకాశం ఉంది. మావో జెడాంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా ఆయన తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనున్నారు. 

click me!