రష్యా మిలిటరీ ట్రైనింగ్ గ్రౌండ్‌పై దాడి.. 11 మంది మృతి.. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఘటన..

By Sumanth KanukulaFirst Published Oct 16, 2022, 9:49 AM IST
Highlights

రష్యా సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. శిక్షణ జరుగుతున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 11 మంది మరణించారు. 

రష్యా సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. శిక్షణ జరుగుతున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 11 మంది మరణించారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిని.. ఆ తర్వాత రష్యా బలగాలు హతమార్చాయి. వివరాలు.. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో పాల్గొనాలనే కోరికను స్వచ్ఛందంగా వ్యక్తం చేసిన వ్యక్తులకు గన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. బెల్గోరోడ్ ప్రాంతంలో లైవ్-ఫైర్ శిక్షణ జరుగుతుండగా.. ఉగ్రవాదులు అక్కడి సిబ్బందిపై చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపినట్టుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లు మాజీ సోవియట్ రిపబ్లిక్‌కు చెందిన వారని.. దాడి తర్వాత వారు కాల్చి చంపబడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తుల పూర్తి వివరాలు తెలియరాలేదని.. వారు మాజీ సోవియట్ దేశానికి చెందిన వారని పేర్కొంది. 

అవమానకర పరాజయాలను చవిచూస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇది మరో ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్న ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు సమీప ప్రాంతం కావడమే. 

ఇక, 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా చేజిక్కించుకున్న క్రిమియాలోని ఒక వంతెనను పేలుడు తర్వాత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వంతెన పేలుడు వెనక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో రష్యా బలగాలను పెంచాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. 

click me!