Earthquake : మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇది ఆస్తినష్టమే కాదు ప్రాణనష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఇప్పటివరకు భూమిపై సంభవించిన అతిపెద్ద భూకంపం గురించి తెలుసుకుందాం.
Earthquake : మయన్మార్ భూకంపం ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఇక్కడ రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం అతలాకుతలం చేసింది. ఇక్కడే కాదు థాయిలాండ్ లో కూడా ఇది అలజడి సృష్టించింది. ఇంత తీవ్రతతో భూకంపం సంభవిస్తేనే పరిస్థితి ఇలా ఉంది అలాంటిది 9.4 తీవ్రతతో భూకంపం సంభవిస్తే ఇంకెలా ఉంటుంది. అదే చిలీలో జరిగింది.
1960 మే 22న చిలీలో చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం నమోదైంది. ఈ భూకంపంను గ్రేట్ చిలీ భూకంపంగా పిలుస్తారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 9.4 నుంచి 9.6 మధ్య నమోదైంది. ఇది దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది.
ఈ వినాశకరమైన భూకంపం కారణంగా చిలీ తీర ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీని ప్రకంపనలు పసిఫిక్ మహాసముద్రంలోని ఇతర దేశాలకు కూడా చేరాయి. ఈ భూకంపం కారణంగా వచ్చిన సునామీ హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరకు విధ్వంసం సృష్టించింది.
మరణాల సంఖ్య కచ్చితంగా తెలియదు. కానీ అంచనా ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 1,000 నుంచి 6,000 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. చిలీలోని అనేక ప్రధాన నగరాల్లోని భవనాలు నేలమట్టమయ్యాయి.
శాస్త్రవేత్తల ప్రకారం ఈ భూకంపం తీవ్రత దాని ఫాల్ట్ లైన్ పొడవుపై ఆధారపడి ఉంది. ఇది దాదాపు 1,000 మైళ్ల వరకు విస్తరించి ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న పొడవైన ఫాల్ట్ లైన్లలో ఒకటి. ఇది ఇంతటి తీవ్రత కలిగిన భూకంపం రావడానికి కారణమైంది. భూమిపై 10.0 తీవ్రతతో భూకంపం రావడం అసాధ్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే అంత పొడవైన ఫాల్ట్ లైన్ మన గ్రహంపై లేదు.