
అధికారుల వివరాల ప్రకారం, బస్సు మొదట 36 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి బయలుదేరింది. అయితే దారిలోో మరో బస్సు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులను కూడా ఈ బస్సులో ఎక్కించుకున్నారు. దీంతో బస్సులో మొత్తం 48 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు పర్వత ప్రాంతంలో వేగంగా ప్రయాణించడం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో బస్సు రహదారి నుంచి జారి లోతైన లోయలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన ప్రాంతం కొండలు, లోయలతో కూడిన క్లిష్ట భూభాగం కావడంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది. భారీ లోయలో పడిపోయిన బస్సు శిథిలాల నడుమ చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. ఘటన స్థలంలో అంబులెన్స్‌లు, అత్యవసర వైద్య బృందాలు, ఇతర సహాయక వాహనాలను మోహరించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని ఝోబ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
షెరాణి-ఝోబ్ హైవే బలూచిస్తాన్‌ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌తో కలిపే కీలక రహదారి. అయితే ఈ మార్గం సన్నని మలుపులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో కూడి ఉండటంతో అత్యంత ప్రమాదకర రహదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. స్థానికుల ప్రకారం, రహదారి భద్రతా ప్రమాణాలు తగిన స్థాయిలో లేకపోవడం, రక్షణ గోడలు లేకపోవడం, కొండ ప్రాంతాల్లో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఆదేశాల మేరకు సంఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. షెరాణి జిల్లా అధికారులు మాట్లాడుతూ, బస్సులో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ప్రమాద తీవ్రతను పెంచిన అంశంగా కనిపిస్తోందన్నారు. డ్రైవింగ్ వేగం, రహదారి పరిస్థితి, బస్సు సాంకేతిక స్థితి వంటి అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రమాదం మరోసారి పాకిస్థాన్‌లోని పర్వత ప్రాంత రహదారుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికుల రక్షణ కోసం కఠినమైన రోడ్డు భద్రతా చర్యలు అవసరం అని స్థానికులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.