POK లో రక్తపాతం.. 19 మంది పిల్లలు, ఏడుగురు గర్భిణీల మృతి.. షాకింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్

Published : Jun 10, 2026, 11:37 AM ISTUpdated : Jun 10, 2026, 11:57 AM IST
POK

సారాంశం

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ సైన్యం జరిపిన అణిచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారని ఓ ఇంటెలిజెన్స్  రిపోర్ట్  ఆరోపించింది. ఈ హింసలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం విచారణ జరపాలని కోరింది.

POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. అక్కడ జరుగుతున్న అల్లర్లపై తాజాగా ఒక సంచలన ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన క్రూరమైన అణచివేతలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఈ రిపోర్టు ఆరోపించింది. ముఖ్యంగా 19 మంది అమాయక పిల్లలు, ఏడుగురు గర్భిణీ స్త్రీలు ఈ హింసలో చనిపోయినట్లు రిపోర్టు వెల్లడించింది. ఈ దారుణాలపై అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి, దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. జూన్ 5 నుండి జూన్ 9 మధ్య పాక్ దళాలు అక్కడ సాగించిన హింసను ఈ రిపోర్టు పూసగుచ్చినట్లు వివరించింది.

బార్మంగ్ బ్రిడ్జ్ కాల్పులు.. అసలు ఏం జరిగిందంటే?

పీఓకేలో ఈ తాజా సంక్షోభానికి 'బార్మంగ్ బ్రిడ్జ్' వద్ద జరిగిన కాల్పుల ఘటనే కారణం. ఆర్థిక, రాజ్యాంగ సంస్కరణల కోసం శాంతియుతంగా పోరాడుతున్న 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC)ని పాకిస్తాన్ మిలిటరీ టార్గెట్ చేయడంతో గొడవలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ప్రజా సంక్షేమం కోసం అహింసా మార్గంలో ఉద్యమిస్తున్న జేఏఏసీ (JAAC) సంస్థను పాక్ అధికారులు ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టం కింద చేర్చారు. ఈ లోపే జేఏఏసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు షాజైబ్ హబీబ్‌ను టార్గెట్ చేసి హత్య చేయడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ హత్యే పీఓకే అంతటా కార్చిచ్చులా నిరసనలు ఎగిసిపడేలా చేసింది.

ఇంటెలిజెన్స్ రిపోర్టులో షాకింగ్ నిజాలు

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 11 మంది పురుషులు మాత్రమే చనిపోయినట్లు చెబుతున్నారు. కానీ, ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు అసలు నిజాన్ని బయటపెట్టింది. చనిపోయిన వారిలో 19 మంది చిన్నారులు, ఏడుగురు గర్భిణీలు ఉన్నారని తెలిపింది. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ఏకంగా 14,000 మంది సైనికులను పీఓకేలో రంగంలోకి దించింది. అక్కడ కమ్యూనికేషన్ బ్లాకౌట్ (ఇంటర్నెట్, ఫోన్ల బంద్) విధించింది. నిరసనకారులు, హబీబ్ అంత్యక్రియలకు వచ్చిన నిరాయుధులైన జనాలపై సైన్యం నిజమైన బుల్లెట్లు ఉపయోగించి కాల్పులు జరిపిందని రిపోర్టు తీవ్ర ఆరోపణలు చేసింది.

స్థానికుల కోపం వెనుక అసలు రీజన్ ఇదే

పీఓకే ప్రజల్లో పాక్ ప్రభుత్వంపై చాలా కాలంగా తీవ్ర అసంతృప్తి ఉంది. తమను రాజకీయంగా పక్కన పెట్టేస్తున్నారని, పీఓకేలో ఉన్న జలవిద్యుత్ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని స్థానికులు మండిపడుతున్నారు. తమ ప్రాంతంలో తయారయ్యే కరెంటును పాకిస్తాన్ వాడుకుంటూ, తమకు మాత్రం కరెంట్ కోతలు విధిస్తోందని, భారీగా విద్యుత్ బిల్లులు బాదుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగానే జేఏఏసీ 38 డిమాండ్లతో ఒక చార్టర్‌ను రూపొందించి ఉద్యమించింది. చౌకగా గోధుమల సబ్సిడీ ఇవ్వాలని, రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహకాలను రద్దు చేయాలని, ప్రాంతీయ వనరులపై తమకు హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ముజఫరాబాద్ ఒప్పందం బ్రేక్.. ముదిరిన వివాదం

నిజానికి అక్టోబర్ 2025లో జరిగిన 'ముజఫరాబాద్ ఒప్పందం' ప్రకారం ఈ డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఆరు నెలల గడువు ముగిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో నిరసనలు మళ్లీ మొదలయ్యాయి. హబీబ్ హత్య తర్వాత పరిస్థితి చేతులు దాటిపోయింది. హబీబ్ మరణం తర్వాత పాక్ దళాలు స్వీపింగ్ ఆపరేషన్ చేపట్టి, 72 మందికి పైగా సివిల్ సొసైటీ నేతలను అరెస్ట్ చేశాయి. జేఏఏసీ సెంట్రల్ ఆఫీస్‌కు సీల్ వేశాయి. జూన్ 7న హబీబ్ అంత్యక్రియల ప్రార్థనల కోసం వచ్చిన జనాలపై లాఠీలు, టియర్ గ్యాస్, తుపాకులతో సైన్యం దాడి చేయడంతో పీఓకే అట్టుడికిపోయింది.

సైన్యంపై తిరగబడ్డ జనం.. ఆర్మీ ఆర్డర్ నో చెప్పిన పోలీస్ అధికారి హత్య

జూన్ 9న దాదాపు 45 లక్షల మంది కాశ్మీరీలు మాస్ మార్చ్‌లో పాల్గొనాలని పిలుపునివ్వడంతో నిరసనలు మిన్నంటాయి. భీంబర్ ప్రాంతంలో రావల్కోట్ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న పౌరుల కాన్వాయ్‌లపై పాక్ సైన్యం షెల్లింగ్ జరిపింది. ఇక మాంగ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 27 మంది పౌరులు చనిపోవడంతో, కోపోద్రిక్తులైన నిరసనకారులు పాక్ మిలిటరీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు.

ఇదే సమయంలో పీఓకే పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సర్దార్ ఇనాయత్ దారుణ హత్యకు గురయ్యారు. నిరసనకారులపై కాల్పులు జరపాలన్న పాక్ ఆర్మీ ఆదేశాలను ఆయన నిరాకరించినందుకే ఇనాయత్‌ను పాక్ సైన్యం కాల్చి చంపిందని ఈ రిపోర్టు సంచలన విషయాన్ని వెల్లడించింది. దీంతో పీఓకేలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

POK: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో అస‌లేం జ‌రుగుతోంది.? ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ఎందుకొస్తున్నారు.?
Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?