రష్యా ఆయిల్ వ్యాపారంపై బ్రిటన్ దెబ్బ.. నయారా ఎనర్జీపై కొత్త ఆంక్షలు!

Published : Oct 16, 2025, 03:33 PM IST
Russia - Britain

సారాంశం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమ దేశాలు రష్యాను ఒంటరి చేయాలన్న ఉద్దేశంతో వరుస ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం.. భారతీయ ఆయిల్ సంస్థ నయారా ఎనర్జీ సహా 90 అంతర్జాతీయ సంస్థలపై కఠిన ఆంక్షలు విధించింది. 

రష్యా–ఉక్రెయిన్ ల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచం కొత్త రకమైన యుద్ధాన్ని చూస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించాయి. బ్యాంకింగ్ ఆంక్షలు, ఆయిల్ నిషేధం వంటి చర్యలు తీసుకున్నాయి. కానీ వాటి ప్రభావం రష్యాపై అంతగా పడలేదు. ఎందుకంటే రష్యా తన ఆయిల్‌ను భారత్‌, చైనా, టర్కీ వంటి దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి చేస్తోంది.

భారత్ కీలక పాత్ర

రష్యాకు సంబంధించిన కొత్త వ్యాపార మార్గాల్లో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా నయారా ఎనర్జీ (Nayara Energy) అనే భారతీయ ఆయిల్ రిఫైనరీ, రష్యా నుంచి భారీగా ఆయిల్ దిగుమతులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో రష్యా దిగ్గజం Rosneftకి వాటా ఉండటంతో.. ఇప్పుడు పాశ్చాత్య దేశాల దృష్టి నయారా ఎనర్జీపై పడింది. బ్రిటన్ ప్రభుత్వం రష్యాపై తన ఆర్థిక పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ 90 అంతర్జాతీయ సంస్థలపై సరికొత్త ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో నయారా ఎనర్జీ కూడా ఉండటం గమనార్హం. పుతిన్ యుద్ధ యంత్రానికి నిధులు రాకుండా చేయడమే ఈ చర్య లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది.

నిజానికి ఇది కేవలం ఒక కంపెనీపై నిషేధం కాదు. ఇది భారత్, రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఉన్న రాజకీయాల మీద ప్రభావం చూపే నిర్ణయం. బ్రిటన్ కొట్టిన ఈ దెబ్బతో, రష్యా తన ఆయిల్ వ్యాపారాన్ని ఎలా కొనసాగిస్తుందో అన్నది ప్రశ్నగా మారింది. అలాగే రష్యా ఆయిల్ కొనకూడదనే దిశగా భారతదేశం మీద కూడా పాశ్చాత్య దేశాల ఒత్తిడి పెరుగుతోంది.

ట్రంప్ వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. భారత ప్రధాని మోదీ రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ఇలాంటి ప్రకటనలు ఒకటి తర్వాత మరొకటి రావడం గమనార్హం.

ఇలాంటి ప్రతికూల వాతావరణంలో నయారా ఎనర్జీ మాత్రం తాము భారత చట్టాల ప్రకారమే పనిచేస్తున్నామని, యూకే ఆంక్షలు అసంబద్ధమైనవని ఘాటుగా స్పందించింది. బ్రిటన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం, నయారా ఎనర్జీపై ఆంక్షలు విధించడం, రష్యా ఆయిల్‌పై మరిన్ని నిబంధనలు తీసుకురావడం వంటి చర్యలు, రాబోయే రోజుల్లో భారత్ తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా ఆసిమ్ మునీర్
30 ఏళ్ల త‌ర్వాత కండోమ్‌ల‌పై ప‌న్ను విధించిన ప్ర‌భుత్వం.. కార‌ణం ఏంటంటే?