
2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు ప్రముఖ ఆర్థికవేత్తలకు లభించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాది నోబెల్ ఆఫ్ ఎకనామిక్స్‌ను జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్‌లకు ప్రకటించింది. వీరు "ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి" (Innovation-Based Economic Growth)పై చేసిన విశేష పరిశోధనలతో ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఈ ముగ్గురి కృషి ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలకు కొత్త దిశను చూపిందని నోబెల్ కమిటీ ప్రకటించింది. సాంకేతికత, ఆవిష్కరణలు, సమాజంలో మార్పులను స్వీకరించే శక్తి.. ఇవే దీర్ఘకాల వృద్ధికి మూల కారణాలని వీరు తమ పరిశోధనల్లో స్పష్టం చేశారు.
చరిత్రాత్మక ఆర్థికవేత్తగా పేరుపొందిన జోయెల్ మోకిర్ సాంకేతిక పురోగతితో ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించారు. సమాజం కొత్త ఆలోచనలను అంగీకరించి మార్పును ఆమోదించినప్పుడే సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని ఆయన నిరూపించారు.
ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్‌లు కలసి సృజనాత్మక విధ్వంసం (Creative Destruction) అనే ఆర్థిక సిద్ధాంతాన్ని గణిత నమూనాల ద్వారా వివరించారు. పాత పద్ధతులను కొత్త ఆవిష్కరణలు భర్తీ చేసే ప్రక్రియ ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు ముందుకు సాగుతుందని వీరి సిద్ధాంతం చెబుతుంది.
ఈ ఏడాది ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి మొత్తం 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌లు (సుమారు 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు)గా ఉంది. మోకిర్ సగం బహుమతి అందుకోగా, అఘియన్, హౌవిట్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు.
ఆరోగ్య విభాగం నుంచి ప్రారంభమైన 2025 నోబెల్ పురస్కారాల ప్రకటనలు ఆర్థిక శాస్త్ర బహుమతితో ముగిశాయి. ఆర్థిక రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించే ఈ అవార్డు, ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తుందని నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది.