రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం?.. 2025లో యుద్ధం చేస్తామని అనిపిస్తున్నది: అమెరికా ఎయిర్‌ఫోర్స్ జనరల్ సంచలనం

By Mahesh KFirst Published Jan 29, 2023, 12:40 AM IST
Highlights

అమెరికా జనరల్ ఓ మెమోలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా పోరాడే పరిస్థితులు తలెత్తుతాయని అనిపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది అంచనా తప్పుగా తేలాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
 

వాషింగ్టన్: రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఘర్షణ అంటే మిగతా దేశాలపైనా వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదీ అమెరికా, చైనాల మధ్య యుద్ధం విషయానికి వస్తే మూడో ప్రపంచ దేశాలపై తీవ్రమైన పరిణామాలు స్పష్టంగా కనిపించే ముప్పు ఉంటుంది. ఇదంతా అక్కరలేని ఆందోళన అని కొట్టిపారేయవచ్చు. కానీ, అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్ జనరల్ ఓ మెమోలో పేర్కొన్న అభిప్రాయం మీడియా కంట పడింది. ఆ అభిప్రాయమే ఇప్పుడు ఆందోళనలకు కారణం అవుతున్నది. 2025లో అమెరికా, చైనాల మధ్య యుద్ధం జరుగుతుందని అనిపిస్తున్నదని ఆయన పేర్కొనడం గమనార్హం.

నా అంచనా తప్పు కావాలనే కోరుకుంటున్నా అని పేర్కొన్న ఫోర్ స్టార్ యూఎఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ మైక్ మినిహాన్.. తన గట్ మాత్రం 2025లో చైనాతో పోరాడతామనే చెబుతున్నదని ఓ మెమోలో పేర్కొన్నారు. ఎయిర్ మొబిలిటీ కమాండ్ మైక్ మినిహాన్ రాసిన ఈ లేఖ ఫిబ్రవరి 1వ తేదీ వేసి ఉన్నప్పటికీ శుక్రవారమే పంపినట్టు తెలిసింది. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, అమెరికా మిలిటరీ అంచనాలకు ఈ అభిప్రాయంతో సంబంధం లేదని పెంటగాన్ అధికారులు స్పష్టం చేశారు.

Also Read: నైట్ క్లబ్‌లో అర్ధరాత్రి పోలీసుల రైడ్.. అదుపులోకి సుమారు 300 మంది.. ఏం జరిగిందంటే? 

జనరల్ అభిప్రాయాలు పెంటగావ్ అంచనాలు ఒకటే కాకపోయినా.. అమెరికా మిలిటరీ ఉన్నత అధికారుల్లో ఉన్న ఆందోళనలను బయటపెట్టింది. త్వరలోనే తైవాన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి చైనా దుందుడుకుగా వ్యవహరించే అవకాశం ఉన్నదని అమెరికా సైన్యంలో ఆందోళనలు ఉన్నట్టు ఈ అభిప్రాయం చెబుతున్నది.

అమెరికా, తైవాన్ దేశాల్లో 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇది చైనా మిలిటరీ యాక్షన్ ప్రారంభించడానికి ఒక అవకాశం ఇవ్వవచ్చు అని మినిహాన్ ఆ మెమోలో రాశారు. 

ఈ కామెంట్లు చైనాపై అమెరికా వైఖరిని రిప్రజెంట్ చేయదని అమెరికా డిఫెన్స్ అఫీషియల్ ఒకరు తెలిపారు.

కాగా, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇదే నెలలో తైవాన్ సమీపంలో చైనా మిలిటరీ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సంగత తెలిసిందే. చైనా పాలనను స్వీకరించాలని తైవాన్‌పై దౌత్య, మిలిటరీ, ఆర్థిక ఒత్తిళ్లకు దిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

click me!