అమెరికా పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు హతం.. ‘అమ్మా, అమ్మా’ అని అరుస్తున్నా చితకబాదుతూ.. తాజా వీడియో బయటకు..

By team teluguFirst Published Jan 28, 2023, 12:45 PM IST
Highlights

అమెరికాలో ఓ నల్ల జాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేశాడని పేర్కొంటూ ఆయనను తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు చనిపోయారు. ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. తాజాగా టైర్ నికోలస్ అనే నల్ల జాతీయుడిపై అమెరికా పోలీసులు తీవ్రంగా దాడి చేయడంతో ఆయన మరణించాడు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యింది. అయితే అతడిపై పోలీసులు దాడి చేస్తున్నప్పటి సమయంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో పలు  దృశ్యాలు రికార్డు అయ్యాయి. అవి తాజాగా బయటకు వచ్చాయి. అందులోని ఫుటేజ్ ఎంతో మందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. పోలీసులు కొడుతున్నప్పుడు అందులో ‘అమ్మా అమ్మా‘ అని అరవడం వినిపిస్తోంది. 

ఏం జరిగిందంటే ? 
జనవరి 7వ తేదీన రాత్రి 8.30 గంటల సమయంలో టైర్ నికోలస్ అనే నల్ల జాతీయుడిని అమెరికా పోలీసులు మెంఫిస్​ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్నాడనే కారణంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, కానీ అతడు పారిపోయేందుకు చూశాడని, అందుకే నికోలస్ ను వెంబడించి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

అయితే నికోలస్ ను పట్టుకున్న సమయంలో అతడిని పోలీసులు చితకబాదారు. దీంతో అతడు జనవరి 10వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. అతడి మరణంతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మెంఫిస్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కాగా.. టైర్ నికోలస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందులోని దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. నికోలస్ ను పట్టుకున్న సమయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించాడు. ముందుగా ఓ పోలీసు అధికారి అతడిని డ్రైవింగ్ సీట్లో నుంచి బయటకు లాగారు. తరువాత మిగితా పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఈ సమయంలో నికోలస్ మాటలు కూడా రికార్డు అయ్యాయి. తానేం తప్పు చేయలేదని, ఇంటికి వెళ్తున్నానని అందులో చెబుతున్నాడు. అయినా కూడా పోలీసులు వినకుండా అతడిని రోడ్డుపై పడేసి చితకబాదారు. పెప్పర్​ స్ప్రే కూడా ఉపయోగించారు. 

పోలీసులు నికోలస్ పై చేసిన అనుచిత ప్రవర్తనకు సంబంధించిన 1 గంట వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో వారి సంభాషణ కూడా వినిపిస్తోంది. పోలీసులు కొడుతున్నప్పుడు బాధితుడు ‘‘అమ్మా, అమ్మా’’ అని అరుస్తున్నాడు. తీవ్రంగా రోధించాడు. ఇవి అందరినీ కంట నీరు పెట్టుకునేలా చేస్తున్నాయి. తనను కొట్టొద్దని ఏడుస్తూ, గాయాల నొప్పికి విలవిలలాడుతున్న వీడియో కూడా కనిపిస్తోంది. అతడు ఎంతగా వేడుకున్నా పోలీసులు మాత్రం తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ ఘటనపై టెన్నెస్సి బ్యూరో ఆఫ్​ ఇన్​వెస్టిగేషన్ దర్యాప్తు మొదలుపెట్టింది. కాగా.. నికోలస్ మరణంతో జో బైడెన్​ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసుల అనుచిత ప్రవర్తన తనకు కోపం తెప్పించిందని అన్నారు. పోలీసులు అతడిపై దాడి చేస్తున్న దృశ్యాలు తాను చూశానని, అవి తనను బాధించాయని పేర్కొన్నారు. 
 

click me!