భవిష్యత్ అంతరిక్షానిదే.. భూమిపై కొంత మందికే చోటు.. పర్యాటక ప్రాంతంగా భూగ్రహం.. జెఫ్ బెజోస్ సంచలనం

By telugu teamFirst Published Nov 14, 2021, 5:44 PM IST
Highlights

భవిష్యత్ అంతరిక్షానిదేనని, వచ్చే కాలంలో మనుషులు అంతరిక్షంలోనే పనిచేస్తారని, అక్కడే పిల్లలకు జన్మనిస్తారని, అప్పుడప్పుడు పర్యటనకు భూమి పైకి వస్తారని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అన్నారు. అందుకే భూమి ప్రత్యేకమైనదని, దాన్ని నాశనం చేయవద్దని తెలిపారు. అంతేకాదు, భూమిపై కొంత మందికే చోటు ఉంటుందనీ అన్నారు. మిగతా వారంతా అంతరిక్షానికి ప్రయాణం కట్టాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

న్యూఢిల్లీ: Amazon సంస్థ వ్యవస్థాపకుడు, సొంత నిధులతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న Jeff Bezos సంచలన వ్యాఖ్యలు చేశారు. Future అంతా అంతరిక్షానిదేనని అన్నారు. భూమి కేవలం పర్యాటక ప్రాంతంగా మారుతుందని వివరించారు. భవిష్యత్‌లో భూ గ్రహంపై కొంత మందే ఉండే అవకాశముందని, మిగతా అందరూ Spaceలో స్థిరపడుతారని ఊహించారు. Earth చాలా ప్రత్యేకమైన ప్రాంతం అని, దాన్ని నాశనం చేయవద్దని అన్నారు. తాను స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థను భవిష్యత్‌లో ఎర్త్ అంబాసిడర్స్‌గా పేర్కొంటారని చెప్పారు.

వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జెఫ్ బెజోస్ మాట్లాడారు. భవిష్యత్‌లో లక్షలు, కోట్లాది మంది ప్రజలు భూ గ్రహం నుంచి అంతరిక్షంలోకి వెళ్తారని అన్నారు. బ్లూ ఆరిజిన్ లక్ష్యం కూడా అదే అని అన్నారు. కోట్లాది ప్రజలు స్పేస్‌లో పని చేసుకుంటారని వివరించారు. వచ్చే శతాబ్దాల్లో చాలా మంది అక్కడే జన్మిస్తారనీ చెప్పారు. అదే వారి సొంతిళ్లు అవుతుందని అన్నారు. స్పేస్‌లో త్వరలోనే కాలనీలు ఏర్పడతాయని వివరించారు. ఆ కాలనీల్లో నదులు, అడవులు ఉంటాయని వివరించారు. అంతేకాదు, అందులో జీవజాతులూ ఉంటాయని చెప్పారు. అంతరిక్షంలో పుట్టిన పిల్లలు అక్కడే.. అవే కాలనీల్లో పెరుగుతారని అన్నారు. అయితే, ఇప్పుడు అందరు అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్‌ను సందర్శించినట్టుగానే అప్పుడు వారు భూగ్రహం మీదకు పర్యటనకు వస్తారని చెప్పారు.

Also Read: చావు లేని జీవితం: ఆ రహస్యాన్ని ఛేదించడానికి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఇన్వెస్ట్!

మానవ జాతి ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉంటే.. పెరుగుతూ ఉంటే వారు నివసించడానికి జోన్‌లను విస్తరించాల్సిన అవసరం ఉన్నదని జెఫ్ బెజోస్ అన్నారు. ఎందుకంటే ఈ భూగ్రహం ఎన్ని సంవత్సరాలు.. ఎంత మందిని మోయగలుగుతుందని ప్రశ్నించారు. ఉదాహరణకు వేయి కోట్ల జనాభాను ఈ భూమి మోయగలుగుతుంది కావచ్చు.. వనరులను అందిస్తుంది కావచ్చు అని అన్నారు. కానీ, ఆ తర్వాత కూడా మానవ జాతి అభివృద్ధి చెందితే ఎలా అనే అంశంపై అందరూ దీర్ఘ ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ భూగ్రహాన్ని నాశనం చేయకుండానే దీనికి పరిష్కారాన్ని వెతకాలని అన్నారు. లక్ష కోట్ల ప్రజలకు వనరులను అందించడానికి మన సౌరవ్యవస్థ సిద్ధంగా ఉన్నదని వివరించారు.

అయితే, ఈ భూగ్రహం మీద కొందరే నివసించాల్సి ఉంటుందని చెప్పిన ఆయన.. ఇక్కడ ఉండే వారిని ఎంపిక చేసేది ఎవరనే విషయంపై మౌనంగానే ఉన్నారు.

Also Read: అది అమెజాన్ కంపెనీ కాదు.. ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0: ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక మరో సంచలన కథనం

ఇటీవలే అంతరిక్ష పర్యటనకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. వర్జిన్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ తొలిసారిగా తన సంస్థ అభివృద్ధి చేసిన వ్యోమ నౌకలో అంతరిక్షానికి వెళ్లి వచ్చారు. తర్వాత బ్లూ ఆరిజిన్ ప్రయోగించిన నౌకలో జెఫ్ బెజోస్ అంతరిక్షానికి వెళ్లి జీరో గ్రావిటీని చవి చూసి వచ్చారు. స్పేస్ ఎక్స్ కూడా ఇలాంటి ప్రయోగం చేసి సఫలమైంది. తాజాగా, కేవలం అంతరిక్ష పర్యటనకే పరిమితం కావడం కాదు.. అక్కడే జీవించే ఆలోచనను జెఫ్ బెజోస్ వెల్లడించారు.

ఇటీవలే ఆయన చావు లేని జీవితం గురించి ప్రయోగాలకు ఫండింగ్ ఇస్తున్నట్టు వార్తల్లోకి ఎక్కారు. ఆ ప్రయోగాల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

click me!