
Afghanistan Earthquake : అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైన ఈ భూకంపంలో ఇప్పటికే 600 మందికి పైగా మరణించారు. దాదాపు రెండు వేల మంది గాయపడ్డారు. గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
అప్ఘానిస్థాన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ భూకంపం విధ్వంసం సృష్టించిందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. భూకంపంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి… వందలాది మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం సహాయం చేయాలని తాలిబాన్ విజ్ఞప్తి చేసింది.
2022, 2023 సంవత్సరాల్లో కూడా అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపాల్లో దాదాపు రెండు వేల మంది మరణించారు. ఈసారి కూడా అదేస్థాయిలో విధ్వంసం జరిగింది… మృతుల సంఖ్య కూడా అదేస్థాయిలో ఉండేలా కనిపిస్తోంది.
తూర్పు అఫ్గానిస్తాన్‌లోని పాకిస్తాన్ సరిహద్దు దగ్గర భూకంపం సంభవించింది. గాయపడిన వారిని కునార్ ప్రావిన్స్‌లోని ఆసుపత్రులలో చేర్చారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించిందని… వరుసగా మూడు ప్రకంపనలు వచ్చాయని యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. రాత్రి 11:47 గంటలకు 8 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని, నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌కు 27 కిలోమీటర్ల తూర్పు-ఈశాన్యంగా భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూకంపంలో ఇళ్లు కూలిపోవడంతో చాలా మంది మరణించారు. తూర్పు అఫ్గానిస్తాన్ అంతటా కొన్ని సెకన్ల పాటు భవనాలు కంపించాయి. 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయని కొన్ని పాక్ మీడియాసంస్థలు తెలిపారు.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ వరదల్లో ఐదుగురు మరణించగా… భారీగా పంటలు, ఆస్తుల నష్టం జరిగింది. ఇప్పుడు భూకంపం మరింత మారణహోమానికి కారణమయ్యింది. ఇలా ప్రకృతి విపత్తులు అప్ఘానిస్తాన్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది.