
ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మాస్క్ షాక్ ఇచ్చారు. చదివే పోస్టులపై పరిమితి విధించారు. విచ్చలవిడిగా డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ ను ఎదుర్కొనే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాస్క్ ప్రకటించారు. దీని వల్ల ట్విట్టర్ పోస్టుల రోజువారీ పఠనంపై తాత్కాలిక పరిమితులను అమలవుతాయని వివరించారు. శనివారం అనేక మంది ట్విట్టర్ యూజర్లు సర్వర్ డౌన్ అయ్యిందంటూ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ‘తాత్కాలిక పరిమితులు’ వర్తింపజేసినట్లు మాస్క్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.
‘‘డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ తీవ్ర స్థాయిలను పరిష్కరించడానికి, తాత్కాలిక పరిమితులను వర్తింపజేశాం‘’ అని మాస్క్ ట్వీట్ చేశారు. తమ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ లో వెరిఫైడ్ ఖాతాలు రోజుకు 6,000 పోస్ట్‌లను చదవడానికి అనుమతి ఉంటుందని, వెరిఫైడ్ కానీ కాతాలు రోజుకు 600 పోస్ట్‌లు, అలాగే కొత్త ఖాతాలు రోజుకు 300 పోస్ట్‌లను చదవగలవని ఆయన తెలిపారు.
కొత్త వినియోగదారులకు నియంత్రిత ఆన్బోర్డింగ్ ప్రక్రియను నిర్ధారించడం, మొదటి నుండి దుర్వినియోగం ప్రమాదాన్ని తగ్గించడమే ఈ కొత్త చర్య లక్ష్యంగా కనిపిస్తోంది. డేటా స్క్రాపింగ్ మరియు సిస్టమ్ మానిప్యులేషన్ ను ఎదుర్కోవటానికి ట్విట్టర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వినియోగదారుల డేటా అనధికారిక సేకరణ, ఆన్ లైన్ సంభాషణ మానిప్యులేషన్ పై ఉన్న ఆందోళనను ఇది పరిష్కరిస్తుంది. ఈ చర్యలను అమలు చేయడం ద్వారా ట్విట్టర్ తన వినియోగదారులకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది,
కాగా.. ట్విట్టర్ లో ఇక నుంచి ట్వీట్లను చూసేందుకు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తప్పనిసరిగా అకౌంట్ ఉండాలి. దీనిని ఎలాన్ మాస్క్ శుక్రవారం వెల్లడించారు. ఇది తాత్కాలిక అత్యవసర చర్య అని పేర్కొన్నారు. ‘‘ మేము డేటాను చాలా దోచుకుంటున్నాం. ఇది సాధారణ వినియోగదారులకు సేవను దిగజార్చుతోంది’’ అని ట్వీట్ చేశారు.