Kochi Water Metro: కేరళలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పర్యటకులు వస్తుంటారు. కేరళలోని నదులు, ఇళ్ల నిర్మాణాలు, ప్రజల జీవనవిధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈక్రమంలో టూరిజాన్ని మరింత అభివృద్ది చేసి పర్యాటలకు ఆకర్షించే లక్ష్యంతో కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ కొత్త సర్వీసులను తీసుకొస్తోంది. ఇప్పటికే మెట్రో పడవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఈ మార్గాల్లో కొత్త సర్వీసులను ప్రారంభించున్నారు.
కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ తన సర్వీసులను విస్తరిస్తోంది. ఇందుకోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మరో నౌకను నిర్మించే పనిలో పడింది. దీంతోపాటు మొత్తం 23 ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్లను నిర్మించడానికి షిప్‌యార్డ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇప్పటివరకు 18 బోట్లను అందజేయగా.. మిగిలినవి అతి త్వరలోనే అప్పగించనున్నారు. ఇక వాటర్ మెట్రో బోట్ సర్వీసులను పెంచడం వల్ల అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో సేవలను పెంచనున్నారు. ఇప్పటికే ఈ బోట్లకు రద్దీ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బోట్లు వస్తాయన్న ప్రకటనతో పర్యటకులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.
నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ..
ప్రస్తుతం, కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ కొచ్చి నగరంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ.. ఆరు మార్గాల్లో సేవలను నిర్వహిస్తోంది. కొత్త బోట్ల రాకతో మరిన్ని సేవలను పెంచే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటి వరకు పర్యాటకులకు సరిపడా బోట్లు లేకపోవడం వల్ల రద్దీ ఏర్పడుతోంది. అనేక టెర్మినల్స్ వద్ద పొడవైన క్యూలలో టూరిస్టులు నిలబడి గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు.
ఎర్నాకులం బోట్ జెట్టీ ప్రారంభమైన తర్వాత...
నూతంగా వచ్చిన బోట్లను మట్టంచెరి, విల్లింగ్‌డన్ ద్వీపం ప్రాంతంలో సేవలను కొనసాగిస్తామని వాటర్ మెట్రో అధికారులు చెబుతున్నారు. "ఎర్నాకులం జెట్టీ ప్రాంతంలో టెర్మినల్ నిర్మాణం కోసం తాము ఇప్పటికే టెండర్ ప్రకటించినట్లు తెలిపారు. ఎర్నాకులం బోట్ జెట్టీ ప్రారంభమైన తర్వాత తాము మట్టంచెరి నుంచి సర్వీసును ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
కొచ్చి వాటర్ మెట్రో త్వరలో మట్టంచెరి నుంచి విల్లింగ్‌డన్ ద్వీపానికి సేవలను ప్రారంభించనుంది. ఎర్నాకులం జెట్టీ వద్ద కొత్త టెర్మినల్ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్ జారీ చేశారు. ఇది పూర్తి చేస్తే మట్టంచెరికి సేవలు అక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి.