భారత స్వాతంత్ర్య సమరంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్నతస్థానం ఉన్నది. ఈ ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని అందుకోకున్నా.. ఇక భారతీయులను పాలించడం మరెంతో కాలం కొనసాగించలేమని బ్రిటీష్ పాలకులకు అర్థం చేయించింది. బ్రిటన్ పాలకులపై ప్రజలను ‘డూ ఆర్ డై’ అనే విధంగా పోరడటానికి ఏకం చేసిన ఉద్యమంగా నిలిచింది.
న్యూఢిల్లీ: భారత దేశాన్ని సుమారు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీష్ పాలనకు చరమ గీతం పాడాలనే లక్ష్యంతో మొదలైనదే క్విట్ ఇండియా ఉద్యమం. భారత దేశాన్ని వదిలి వెళ్లండి అని అర్థం స్ఫురించే ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 8న పిలుపు ఇచ్చారు. ఈ ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా పిలుస్తారు. బాంబేలో గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో 1942 ఆగస్టు 8న భేటీ అయిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీ ఈ పిలుపు ఇచ్చారు.
అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. ఆ యుద్ధంలో ఫాసిస్టులను ఓడించాలని, అంటే జర్మనీ, ఇటలీ, జపాన్(యాక్సిస్ పవర్స్)లపై యుద్ధంలో భారతీయులను వినియోగించుకోవాలని బ్రిటీష్ పాలకులు ప్రయత్నించే కాలం కూడా. అప్పుడు భారత్ నుంచి మద్దతు కోసం స్టాన్‌ఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఓ ప్రతినిధుల బృందాన్ని బ్రిటీన్ మన దేశానికి పంపింది. కానీ, ఆ క్రిప్స్ మిషన్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో విఫలమైంది.
undefined
రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తలమునకలై ఉన్నది. మరో వైపు జపాన్ సేనలు భారత్ వైపు సమీపిస్తున్నాయి. ఈ పరిణామాన్ని స్వాతంత్ర్యం కోసం బ్రిటీషర్లపై ఒత్తిడి పెంచడానికి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించారు. స్టాన్‌ఫర్డ్ క్రిప్స్ మిషన్ 1942 ఏప్రిల్‌లో విఫలమైన మూడు నాలుగు నెలల్లోనే మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని వేగవంతం చేసిన పిలుపు ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఏకం చేసిన ఉద్యమానికి సమాయత్తం చేశారు.
1942 జులై 14వ తేదీనే బ్రిటీషర్ల నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం పొందాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్దాలో తీర్మానం చేసింది. ఒక వేళ బ్రిటీష్ ప్రభుత్వం తమ తీర్మానాన్ని అంగీకరించకుంటే శాసనోల్లంఘన ఉద్యమాన్ని చేపట్టాలని ప్రతిపాదించింది. అదే తీర్మానాన్ని బాంబే సమావేశంలో ఆమోదించింది. బాంబే సమావేశంలో గాంధీ మాట్లాడుతూ, బ్రిటీషర్లు వెంటనే భారత్ వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు. లేదంటే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో భారత ప్రజలను ఆయన క్విట్ ఉద్యమానికి సమాయత్తం చేశారు. తాను దేశ ప్రజలకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నానని, దీన్ని తమ హృదయాల మీద ముద్రించుకోవాలని, ఆ మంత్రాన్నే శ్వాసించాలని అన్నారు. ఆ మంత్రం ఏంటంటే.. డూ ఆర్ డై అని పేర్కొన్నారు. పోరాడండి లేదా చావండి అని పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తారని, లేదంటే ఆ అది పొందే క్రమంలో ఆయువు కోల్పోతారని ఉద్వేగంగా ప్రసంగించారు.
ఆ ప్రసంగం దేశం నలుమూలలో ప్రజలను జాగరూకం చేసింది. అప్పటి నుంచి క్విట్ ఇండియా, డూ ఆర్ డై.. రణన్నినాదం అయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
కాంగ్రెస్ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఆందోళన ప్రదర్శనలు, హర్తాళ్లు చేపట్టారు. ఒకానొక దశలో బ్రిటీషర్లు తమ అదుపును కోల్పోతున్నామనే భయం మొదలైంది. బ్రిటీషర్లు కాంగ్రెస్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సత్యాగ్రహులపై ఉక్కుపాదం మోపారు. పదుల వేలల్లో జైలుకు తరలించారు. ప్రజలపై విచక్షణ రహిత దాడులకు ఆదేశాలు చేశారు. లాఠీ చార్జీలు, అరెస్టులు సర్వసాధారణమైపోయాయి. చాలా చోట్ల కాల్పులు కూడా జరిపారు. జరుగుతున్న పరిణామాల కారణంగా కొన్ని చోట్ల పౌరులూ ఉద్వేగంతో రగిలిపోయారు. హింసాత్మక ఆందోళనలకూ దిగారు. చాలా చోట్ల పోలీసులపైనా దాడులు జరిపారు. ప్రభుత్వ ఆస్తులను, రైల్వే లైన్‌లను ధ్వంసం చేశారు. పోస్టులు, టెలిగ్రాఫ్‌లనూ నాశనం చేశారు. జైళ్లకు పంపిన ఆందోళనకారులు రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు చాలా మందికి కారాగారాల నుంచి విముక్తి లభించలేదు.
రెండో ప్రపంచ యుద్ధంలోకి భారత్‌ను లాగాలనే బ్రిటీషర్ల దురాలోచనలతో క్విట్ ఇండియాకు గట్టి బీజం పడింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం భారత ప్రజలను ఏకం చేసిందనడంలో సందేహమే లేదు. బ్రిటీష్ పాలనపై ఐక్యంగా పోరాడే రణ నినాదంగా మారింది. క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీజీ పిలుపు ఇవ్వగానే రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని బ్రిటీషర్లు జైళ్లకు పంపారు. ఈ ఆందోళనలను అణచివేయడంలో 1944 వరకు బ్రిటీషర్లు చాలా వరకు సఫలం అయ్యారు. 1944 గాంధీజి జైలు నుంచి విడుదలైన తర్వాత 21 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో బ్రిటన్ దేశ స్థితిగతుల్లో అనేక మార్పులు వచ్చాయి. భారత్‌లో ఉధృతం అవుతున్న స్వాతంత్ర్య సమరంతో ఇక మరెంతో కాలం వారి ఉద్యమాన్ని అణచివేయలేమని బ్రిటీష్ పాలకులకు అర్థం అయింది.