Ram Mohan Roy: హిందూ మతం సంస్కరణ కోసం ఉద్యమం చేపట్టారు. సమాజంలో ప్రబలంగా ఉన్న సాంఘిక దురాచారాలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగారు. మూఢ ఆచారాలు, సతీసహగమనం, బహుభార్యాత్వం, బాల్య వివాహాలు, కుల వ్యవస్థలను రాజా రామ్మోహన్ రాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
Azadi Ka Amrit Mahotsav : భారత స్వాతంత్ర్య పోరాటాని కంటే ముందుగానే దేశంలో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమించారు. భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా పేరుగాంచారు. బాల్యవివాహాలు, సతీ సహగమనం పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా.. వాటిని అడ్డుకోవడానికి కృషి చేశారు. సతీసహగమన నిషేధ చట్టం తీసుకురావడంలో విజయం సాధించారు. బ్రహ్మ సమాజ్‌ను స్థాపించి సంస్కరణల కోసం కృషి చేశారు. నేటి భారతీయ సమాజంలో మార్పులకు ఆయన కృషి కారణమని నమ్ముతారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలో కీలక ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1772 మే 22న బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని రాధానగర్‌లో రాజా రామ్మోహన్ రాయ్.. రామ్‌కాంతో రాయ్, తారిణి దేవి దంపతులకు జన్మించారు. రామ్‌కాంతో రాయ్.. అరబిక్, లాటిన్, గ్రీకు, సంస్కృత, పర్షియన్, ఆంగ్ల భాషలలో గొప్ప పండితుడు. రాయ్ ప్రాథమిక విద్య బెంగాలీ, కొంత సంస్కృతంలో కొనసాగింది. ఆ తర్వాత ఆయన పాట్నాలోని మదర్సాలో చేరాడని చెబుతారు. అక్కడ రాయ్ పర్షియన్, అరబిక్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత రాయ్ బనారస్(కాశీ) వెల్ళాడు. అక్కడ సంస్కృతం, వేదాలు, ఉపనిషత్తులు.. వంటి హిందూ గ్రంథాలను అభ్యసించారు. ఆ తర్వాతే రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ నేర్చుకన్నారు.
undefined
18వ శతాబ్దపు చివరి సంవత్సరాల్లో.. ఆయన కోల్‌కత్తాలోని ఈస్టిండియా కంపెనీలో పనిచేసిన ఆంగ్లేయులకు డబ్బు ఇవ్వడం ప్రారంభించారు. అదే సమయంలో ఆంగ్ల న్యాయ స్థానాలలో బ్రాహ్మణ పండితుడిగా తన పనిని కొనసాగించారు. గ్రీకు, లాటిన్‌లను అధ్యయనం చేయడం ప్రారంభించారు. 1803 నుండి 1815 వరకు.. ఆయన ముర్షిదాబాద్‌లోని అప్పీలేట్ కోర్ట్ రిజిస్ట్రార్ థామస్ వుడ్‌రోఫ్ వద్ద 'మున్షీ' (ప్రైవేట్ క్లర్క్)గా పనిచేశారు. తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి.. ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్టర్ జాన్ డిగ్బీ వద్ద పనిలో చేరారు.
ఈ క్రమంలోనే భారతదేశంలో సేకరించిన మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఇంగ్లండ్‌కు పంపబడుతుందని ఆయన అంచనా వేశారు. 1810-1820 మధ్య ఆయన మతం, రాజకీయాలతో సహా అనేక విషయాలపై రచనలను ప్రచురించారు. 1830లో రామ్మోహన్ రాయ్ మొఘల్ సామ్రాజ్యం యొక్క రాయబారిగా యూకేకు వెళ్లారు. భారతదేశంలో సమాజాన్ని, మతాన్ని సంస్కరించేందుకు ఆయన ప్రయత్నించారు.
1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్‌ను స్థాపించారు. హిందూ మతం సంస్కరణ కోసం ఉద్యమం చేపట్టారు. సమాజంలో ప్రబలంగా ఉన్న సాంఘిక దురాచారాలపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగింది. మూఢ ఆచారాలు, సతీసహగమనం, బహుభార్యాత్వం, బాల్య వివాహాలు, కుల వ్యవస్థలను రాజా రామ్మోహన్ రాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీలకు ఆస్తి వారసత్వ హక్కులను కోరాడు. రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల 1829లో విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు.
సమాజంలో సాంఘిక సంస్కరణ తీసుకురావడానికి.. విద్యను సమర్ధవంతంగా జనాల్లోని తీసుకెళ్లాలని ఆయన భావించారు. ఏకేశ్వరోపాసనను ప్రచారం చేసేందుకు వేదాంత కళాశాలను స్థాపించారు. దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశారు. డేవిడ్ హరే సహకారంతో 1817లో కలకత్తాలోని హిందూ కళాశాల స్థాపించారు. అంతేకాకుండా అనేక సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 1830లో స్కాటిష్ చర్చి కళాశాలను స్థాపించడంలో సహాయపడ్డారు.
బిట్రన్‌లో పర్యటనలో ఉన్న రాజా రామ్మోహన్ రాయ్.. బ్రిస్టల్ లోని స్టాపుల్టన్‌లో 1833 లో మెదడువాపు వ్యాధితో మరణించారు. ఆయన దక్షిణ బ్రిస్టల్‌లోని ఆర్నోస్ వేల్ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బ్రిటీష్ ప్రభుత్వం.. బ్రిస్టల్‌లోని ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోపాల్ కృష్ణ గోఖలే రాయ్‌ని ‘ఆధునిక భారతదేశపు పితామహుడు’ అని పిలిచారు. అనేకమంది చరిత్రకారులు ఆయనను భారతీయ పునరుజ్జీవనోద్యమానికి మార్గదర్శకులలో ఒకరిగా భావిస్తారు.