జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

By Arun Kumar P  |  First Published Dec 28, 2019, 4:35 PM IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన సంగారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో మున్నిపల్ ఎన్నికల్లో సాధించి తీరాలని మంత్రి హరీష్ రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం సమీకరణాలను మార్చడమే కాదు ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్.  


సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాల పునర్విభజనలో భాగంగా మూడుగా విడిపోయింది. అయితే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నా సంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఇంకా పట్టు నిలుపుకుంటోంది. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఈ గెలుపు ప్రభావం జిల్లామొత్తంలో పనిచేసి టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది.

దీంతో సంగారెడ్డిని చేజిక్కించుకునేందుకు స్వయంగా టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో సంగారెడ్డి జిల్లాలోని అన్ని  మున్సిపాటీలను కైవసం  చేసుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇలా జరగాలంటే మొదటి సంగారెడ్డి మున్సిపల్ కార్పోరేషన్ ను కైవసం చేసుకోవాల్సి వుంటుంది. ఈ దిశగానే హరీష్ పావులు కదుపుతున్నారు. 

Latest Videos

ముందుగా సంగారెడ్డి రాజకీయాలను తనవైపు తిప్పుకున్న హరీష్ ఇప్పుడు ప్రజలకు దగ్గరయ్యే పనిలో పడ్డారు. ఇప్పటికే జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన రెండో స్థాయి నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా స్థానికంగా పట్టు సాధించారు. ఇప్పుడు జిల్లాలో వివిధ అభివృద్ది పనుల నిమిత్తం విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో పడ్డారు. 

read more  లెక్కల టీచర్ గా మారిన ఆర్థిక మంత్రి హరీష్

ఈక్రమంలో హరీష్ రావు వారంలో దాదాపు ఒక్కరోజయినా సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను  అడిగి ప్రస్తుత పార్టీ పరిస్థితులను గురించి తెలుసుకుంటున్నారు. కేవలం తెలుసుకోవడమే కాదు ఏదైనా సమస్యలుంటే స్వయంగా మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. 

ఇక సంగారెడ్డి పట్టణం విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి విజయానికి కారణమైన మండలాలపై  దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇటీవల కంది మండలానికి చెందిన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ నాయకులు కొత్తగా చేరిన వారిని కలుపుకు పోవాలని కూడా హరీష్ సూచించారు. ఇలా రెండో స్థాయి నాయకులను చేర్చుకోడానికి హరీష్ స్వయంగా హాజరవడమే సంగారెడ్డిపై  ఆయన ఏ స్థాయిలో దృష్టి సారించారో అర్థమవుతుంది. 

ఇక జిల్లా అభివృద్ది విషయానికి వస్తే తాజాగా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వరాల జల్లు కురిపించారు. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా  సీఎం కేసీఆర్ మెటీరియల్ కాంపోడ్స్ కింద 100 కోట్లు విడుదల చేసారని  గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ లు, స్మశాన వాటికలు నిర్మాణం చేపట్టాలని...ప్రతి నెల ప్రతి గ్రామపంచాయతీకి రూ.339 కోట్లు ప్రభుత్వం  విడుదల చేస్తోందన్నారు.  

read more  నా భార్యకు కూడా టికెట్ ఇవ్వను, కానీ చైర్ పర్సన్...: జగ్గారెడ్డి

ఇలా అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే పనిలో పడ్డారు హరీష్. దీనివల్ల మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొంది కాంగ్రెస్ ప్రాభవాన్ని తగ్గించి సంగారెడ్డి నుండి  కూడా తరిమికొట్టాలని మంత్రి హరీష్ రావు భావిస్తున్నారు. ట్రబుల్ షూటర్ ప్రయత్నాలు ఏ మేరకు నెరవేరుతాయో మున్సిపల్ ఎన్నికల పలితాల తర్వాత తేలుతుంది. 


 

click me!