నేను ప్రేమిస్తే.. నువ్వు పెళ్లిచేసుకుంటావా: లవర్‌కి కాబోయే భర్తపై ప్రియుడి దాడి

By Siva KodatiFirst Published Nov 26, 2019, 6:17 PM IST
Highlights

తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో వివాహం నిశ్చయమవ్వడంతో ఓ ప్రేమికుడు తట్టుకోలేకపోయాడు

తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో వివాహం నిశ్చయమవ్వడంతో ఓ ప్రేమికుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రేయసి ఇక దక్కదనే అక్కసుతో ఉన్మాదిగా మారిపోయాడు.

ఈ క్రమంలో పెళ్లి కొడుకుని అడ్డు తొలగిస్తే నువ్వే పెళ్లి చేసుకోవచ్చని మిత్రులు ఇచ్చిన సలహా ఆ ప్రేమికుడికి బాగా నచ్చింది. అనుకున్నదే తడువుగా స్నేహితులతో కలిసి కాబోయే భర్తపై దాడి చేశారు.

Also read:రేపే మహారాష్ట్రలో బలపరీక్ష: అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ ఆదేశం

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ గురుబ్రహ్మ నగర్‌కు చెందిన గోపాల్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి జూబ్లీహిల్స్‌లోని ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్టుగా పనిచేస్తోంది. గోపాల్ కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు.

అయితే కొద్దిరోజులు ఇద్దరూ స్నేహంగానే మెలిగారు. ఇదే సమయంలో యువతికి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మరో నాలుగు నెలల్లో పెళ్లి జరపాలని నిర్ణయించారు.

ఈ విషయం తెలుసుకున్న గోపాల్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ప్రేమించిన యువతి మరోకరికి దక్కకూడదని ప్రతినిత్యం ఆమె వెంట పడుతూ వేధిస్తున్నాడు. అదే సమయంలో కాబోయే భర్తను అడ్డు తొలగిస్తే యువతి దక్కుతుందని గోపాల్ మిత్రుడు జీవన్ సలహా ఇచ్చాడు.

ఇద్దరు కలిసి సదరు యువకుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవద్దని బెదిరించాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌లో భాగంగా ఆదివారం రాత్రి గోపాల్ పీకలదాకా మద్యం తాగి... దుర్గాభవాని నగర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కాపు కాస్తున్నాడు.

జీవన్ ఆ యువతికి కాబోయే భర్తను ఓ చోట కలిసి లిఫ్ట్ కావాలని అడిగి నేరుగా గోపాల్ ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చి అనంతరం ఇద్దరూ కలిసి చితకబాదారు. తన ప్రియురాలిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావంటూ గోపాల్ కసితీరా కొట్టాడు. ఆమెను వదలకపోతే అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Also read:లోక్‌పాల్ లోగో.. నినాదం ఇదే

వారి బారి నుంచి ఎలాగొలా తప్పించుకున్న బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు గోపాల్, జీవన్‌లను ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం ఉదయం నాంపల్లి 10వ ప్రత్యేక మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 
 

click me!