బయో డైవర్సిటీ ఎఫెక్ట్: ఓవర్‌ స్పీడుగా వెళితే అంతే సంగతులు.. ఎందుకంటే..!

By Siva KodatiFirst Published Nov 25, 2019, 6:39 PM IST
Highlights

ఇకపై భాగ్యగరంలోని అన్ని ప్లైఓవర్‌లపై సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ఈ సీసీటీవీ కెమెరాలకు గాను ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌లింక్ కానుంది

హైదరాబాద్: భాగ్యనగరంలో గత కొన్ని రోజులుగా ఘోర రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

అయితే ఇలా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ ఎక్కువవుతుండటం.. ఇటీవలే బయోడైవర్శిటీ ప్లైఓవర్‌పై ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. బహుశా ఇలాంటి ప్రమాదం ఈ ప్లై ఓవర్‌పై జరగడం ఇదే మొదటి సారైనా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!

Also Read:బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ

ఇలాంటి ప్రమాదాలను నిలువరించడానికి.. అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారికి కళ్లెం వేయడానికి హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇప్పటికే బయోడైవర్శిటీ లాంటి రద్దీ ప్లైఓవర్‌పై సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగింది.

అయితే ఇకపై భాగ్యగరంలోని అన్ని ప్లైఓవర్‌లపై సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పోలీసులు నిర్ణయించారు. కాగా ఈ సీసీటీవీ కెమెరాలకు గాను ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌లింక్ కానుంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వాహనాలు అతివేగంగా నడిపినా పసిగట్టేసి.. ఆటోమాటిక్‌గా ఆ వాహనాల వేగానికి సంబంధించి అన్ని రిపోర్టులను బయటికి తీయడానికి ఉపయోగడపడుతుంది.

వాస్తవానికి నగరంలోని పలు ఫ్లైఓవర్‌లపై ఇప్పటికే కెమెరాలు ఉన్నప్పటికి వాటిని మరింత పెంచుతున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. కారు వేగం ఒక్కటే కాకుండా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినా ఈ కెమెరాల ద్వారా త్వరగా తెలుసుకోవచ్చు.

బయోడైవర్శిటీ ప్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంతో పాటు నగరంలో మరో రెండు మూడు చోట్ల జరిగిన ప్రమాదాల అనంతరం పోలీసులు ఇలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నగరంలోని అన్ని ఫ్లైఓవర్స్‌పై సీసీటీవీ కెమెరాలు అమర్చబోతున్నామని.. వీలైనంత త్వరలోనే ఈ ప్రక్రియ ఉంటుందన్నారు.

పైన చెప్పిన సాఫ్ట్‌వేర్ ద్వారా ఎంత వేగంతో వాహనాలు నడుపుతున్నారు..? అనేది ఆటోమాటిక్‌గా తెలుసుకోవచ్చన్నారు. అంతేకాదు.. ప్రమాదం జరిగిన తీరును త్వరగా తెలుసుకోవచ్చన్నారు. ఇలా విషయం తెలిసిన తర్వాత దగ్గర్లో ఉండే పోలీస్ స్టేషన్‌, పెట్రోలింగ్‌‌లో ఉండే ఖాకీలను అలెర్ట్ చేసుకోవచ్చని ఆ ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.

Also Read:బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

మొత్తానికి చూస్తే బయోడైవర్శిటీ ప్లైఓవర్‌పై జరిగిన ప్రమాదంతో ఇటు అతిగా వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టడానికి మంచి ప్రయోగమే చేస్తున్నారు. అయితే పోలీసుల తాజా ప్రయోగంతో రోడ్డు ప్రమాదాలు ఏ మాత్రం తగ్గుతాయో వేచి చూడాల్సిందే మరి.

click me!